వినోదాల దర్శకుడిగా పేరుగాంచిన త్రినాథరావు నక్కిన (Trinadha Rao) నుండి ఈ రోజు ‘మజాకా’ (Mazaka) అనే సినిమా వచ్చింది. లాజిక్‌లు లేకుండా నవ్వులు కావాలంటే సినిమా చూడండి అంటూ ఇనీషియల్ టాక్ బయటకు వచ్చింది. ఆ టాక్‌ను ముందుగానే ఊహించారో లేక బాగా నమ్మకంగానే ఉన్నారో ఏమో కానీ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని టీమ్ ఫిక్స్ అయిపోయింది. దీంతోపాటు మరో సీక్వెల్‌కు రెడీ అవుతున్నారు. ఈ విషయాల్ని ఆయనే చెప్పారు.
కథలో కామెడీ మాత్రమే కాదు.. విలువలు కూడా ఉండాలనేది నా ఆలోచన అని చెబుతుంటారు త్రినాథరావు నక్కిన. ఆయన తొలి సినిమా నుండి ఇదే పంథాను ఫాలో అవుతూ వస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తా మావా’ (Cinema Chupista Maava), ‘నేను లోకల్’ (Nenu Local) , ‘ధమాకా’ (Dhamaka) అంటూ కామెడీ + ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశారాయన. ఇప్పుడు ‘మజాకా’ సినిమా విషయంలోనూ అదే చేశారు. దీనికి సీక్వెల్‌గా ‘డబుల్ మజాకా’ చేస్తామని చెప్పారు.
అంతేకాదు రవితేజ (Ravi Teja) ‘ధమాకా’కి కొనసాగింపుగా ‘డబుల్ ధమాకా’ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే రవితేజ – త్రినాథరావు నక్కిన – ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar) కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు త్రినాథరావు నక్కిన తమ సీక్వెల్ ఆలోచను చెప్పారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి. ‘మజాకా’ సినిమా మలయాళ హిట్ బొమ్మ ‘బ్రో డాడీ’కి రీమేక్ అంటూ వస్తున్న పుకార్ల గురించి కూడా త్రినాథరావు నక్కిన స్పందించారు.
‘ధమాకా’ చేస్తున్న సమయంలోనే ప్రసన్నకుమార్ ‘మజాకా’ కథని చెప్పారని, ఈ కథని సందీప్ కిషన్ (Sundeep Kishan) ఒప్పుకోవడం గొప్ప విషయమన్నారాయన. ‘బ్రో డాడీ’ స్ఫూర్తితో రాసినదేనా? అని కూడా అడుగుతున్నారని, ఆ కథ వేరు, ఇది వేరని చెప్పారు. ఆడదిక్కు లేని ఓ ఇంట్లో తండ్రీ కొడుకుల చుట్టూ సాగే కథ ‘మజాకా’ అని. ఇంట్లో ఎలాగైనా ఓ ఫ్యామిలీ ఫొటో కనిపించాలనేది హీరో తండ్రి తపన అని. అందుకోసం ఏం చేశాడు? ఆయన తనయుడు ఏం చేశాడనేది కథ అని చెప్పారు.