ఇండియాలో వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. అలాంటిది ఓ వెబ్ సిరీస్ కోసం మీడియం రేంజ్ హీరోకి వంద కోట్లు ఆఫర్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి క్రేజీ ఆఫర్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి దక్కినట్లు సమాచారం. ఓటీటీలో నెంబర్ వన్ ఫ్లాట్ ఫామ్ గా దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ షాహిద్ తో రూ.100 కోట్లకు డీల్ చేసుకుందట. ప్రపంచస్థాయి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ను దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించనున్నట్లు సమాచారం.
నిజానికి ఒకప్పటితో పోలిస్తే షాహిద్ క్రేజ్ బాగా తగ్గిపోయింది. కానీ గతేడాది ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమాలో నటించి తన రేంజ్ పెంచుకున్నాడు. ఈ సినిమాతో షాహిద్ క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం అతడు ఒక్కో సినిమాకి రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే సినిమాతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ కోసం చేయబోయే వెబ్ సిరీస్ కు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు సీజన్ల పాటు సాగే ఈ సిరీస్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సివుంది. ఆ కారణంగానే రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తో షాహిద్ ని లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది.
వెబ్ సిరీస్ లపై వందల కోట్లు వెచ్చించడం నెట్ ఫ్లిక్స్ కి కొత్తేమీ కాదు. ఒరిజినల్ కంటెంట్ కోసం ఈ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇండియాలో కూడా ఓటీటీల హవా పెరగడంతో నెట్ ఫ్లిక్స్ ఈ భారీ సిరీస్ ని ప్లాన్ చేస్తోంది. ఇక దర్శక ద్వయం రాజ్-డీకే విషయానికొస్తే.. వీరు డైరెక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మెన్’కి మంచి పేరొచ్చింది. ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కి కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్ ను విడుదల చేయనున్నారు. దీని తరువాత షాహిద్ ప్రధాన పాత్రలో నెట్ ఫ్లిక్స్ కోసం మరో సిరీస్చేయబోతున్నారు .