తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’ తర్వాత అంత సంచలనం సృష్టించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. తెలుగు సినిమా సమీకరణలు సరిచేసిన సినిమా అది. ఆ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకి ఎంతటి మంచి పేరు వచ్చిందో.. చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా అదే స్థాయిలో పేరొచ్చింది. విజయం వెనుక ఇండస్ట్రీ పరుగు ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. సందీప్ రెడ్డికి ఆఫర్లు చుట్టుముట్టాయి. అయితే.. విజయగర్వాన్ని తలకెక్కించుకోని సందీప్ రెడ్డి ఆ ఆఫర్లను పట్టించుకోకుండా మళ్ళీ తన సొంత బ్యానర్ లోనే ఒక సినిమా చేసుకొందామని స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టాడు.
అయితే.. సందీప్ రెడ్డి ఇంటి తలుపులు అదృష్టలక్ష్మి తెరిచేవరకూ బాడుతూనే ఉంది. అందుకే “అర్జున్ రెడ్డి” హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ “అర్జున్ రెడ్డి” హిందీ వెర్షన్ ను నిర్మిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన షాహిద్ కపూర్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడని వినికిడి. ఇంకా హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. తెలుగులో వలె హిందీలోనూ “అర్జున్ రెడ్డి” హిట్ అయ్యిందంటే మాత్రం సందీప్ రెడ్డి మరో రాంగోపాల్ వర్మలా రూపాంతరం చెందడం ఖాయం.