Rohith Shetty: స్టార్ డైరక్టర్ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?
- February 2, 2026 / 06:15 PM ISTByFilmy Focus Desk
ముంబయిలో ఇటీవల కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గతంలో ముంబయిలో కాల్పుల కలకలం చోటు చేసుకోవడం తరచుగా జరిగేది. అయితే వరుస దాడులు, కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. తాజాగా మరోసారి వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఆ మధ్య సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. దీంతో మరోసారి బాలీవుడ్, బొంబాయి ఉలిక్కిపడ్డాయి.
Rohith Shetty
ముంబయిలోని అత్యంత కీలకంగా ఉండే జూహు ప్రాంతంలో రోహిత్ శెట్టి ఇల్లు ఉంది. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది అదే ప్రాంతంలో ఉంటారు. ఫిబ్రవరి 1న అర్థరాత్రి 12.40 గంటల సమయంలో అగంతకుడు వచ్చి రోహిత్ శెట్టి ఇంటిపైకి ఐదు రౌండ్ల తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవ్వరూ గాయపడకపోయినా.. ఆందోళన అయితే చెలరేగింది. దాడి వెనక ఎవరున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోహిత్ ఇంటి చుట్టుపక్కలున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
ముంబయిలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా చెప్పే జూహూలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముంబయి పోలీస్ యంత్రాంగం ఆగమేఘాల మీద సమీక్ష సమావేశం నిర్వహించింది. రోహిత్ నివాసం ఉంటున్న టవర్ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇది స్థానిక ముఠాల పనా? లేక సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీమ్ పనా అనేది పరిశీలిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. ఇదిలా ఉండగా కాల్పుల సమయంలో రోహిత్ ఇంట్లో ఉన్నారా లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ ఈ పని కావాలని చేసి ఉంటే. ఈపాటికే ఆ గ్యాంగ్ ప్రకటన ఇచ్చేది. చూడాలి మరి ఇప్పటికే రెండ్రోజులు అయింది. ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు.













