తెలుగు దర్శకులు అత్త, అల్లుడి మధ్య సరదా పోటీని వెండితెరపై ఎంతో చక్కగా చూపించారు. తాజాగా మారుతి అత్త, అల్లుడి మధ్య ఉండే బంధాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నమే శైలజా రెడ్డి అల్లుడు మూవీ. ఇందులో అత్తగా రమ్యకృష్ణ , అల్లుడిగా నాగచైతన్య నటిస్తున్నారు. అత్త కూతురిగా అను ఇమ్యానుయేల్ కనిపించనున్న ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్త, అల్లుడి మధ్య ఉండే సన్నివేశాలను రివీల్ చేయలేదుగానీ… ఈగో ఎక్కువగా నిండిన అను గురించి చెబుతూ… “పిల్లే ఇలా ఉంటే ఈమె తల్లి ఎలా ఉంటుందో..” అనే డైలాగ్ తో అత్త గురించి చైతూ తనదైన శైలిలో చెప్పారు.
చైతూ, అను ఇమ్యానుయేల్ మధ్య ప్రేమ సన్నివేశాలకు కొదవలేదని తెలుస్తోంది. అలాగే నాగచైతన్య లుక్ కొత్తగా ఉండడం ప్లస్ కానుంది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అత్త రోల్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆత్రుతని పెంచింది. గోపి సుందర్ అందించిన పాటలను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది.