ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ నటి శిల్ప శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగినట్లు వస్తున్న వార్తల విషయంలో శిల్పా శెట్టి తరఫు లాయర్ కొన్ని వ్యాఖ్యలు, సూచనలు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న వ్యవహారం, కేసుల్లో శిల్పా శెట్టికి ఎలాంటి సంబంధం లేదని ఆమె తరఫున న్యాయవాది స్పష్టం చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణం, వాటి ప్రసారం కేసులో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
రాజ్ కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు చేపడుతున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీనిపైనే శిల్పా శెట్టి తరఫు లాయర్ స్పందించారు. శిల్పాకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరగలేదని న్యాయవాది తెలిపారు. అయితే రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసు విచారణ అయితే కొనసాగుతోందని, అధికారులకు ఆయన బాగానే సహకరిస్తున్నారని లాయర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు ప్రచారమవుతున్న వార్తల్లో శిల్పా శెట్టి ఫొటోలు, వీడియోలు ఉపయోగించొద్దని కోరారు.
ఒకవేళ ఆమె పుటేజ్ వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు మీడియాలో వస్తోన్న వార్తలపై రాజ్ కుంద్రా కూడా స్పందించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దయచేసి నిజాలనే ప్రచారం చేయండి. నాలుగేళ్ల నుండి ఈ కేసుల విషయంలో విచారణలు జరుగుతున్నాయి. సంబంధం లేని విషయాల్లో నా భార్య పేరును పదేపదే ఉపయోగించడం అమోదయోగ్యం కాదు. దయచేసి మా ప్రైవసీని గౌరవించండి అని రాసుకొచ్చారు.
ఇక ఈ కేసు విషయం గురించి చూస్తే.. అశ్లీల చిత్రాలను నిర్మించి వివిధ ఓటీటీలు, యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేశారని 2021లో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిలో భాగంగా అప్పుడు రాజ్ కుంద్రాను అరెస్టు కూడా చేశారు. కొన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు కూడా. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి ఆయన పెద్దఎత్తున ఆర్జించినట్లు ఆ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.