రంగస్థలం సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆ చిత్రం సాధించిన విజయాన్ని చూసి ఆనందపడుతుంటే ప్రముఖ జానపద కళాకారుడు శివనాగులు మాత్రం బాధపడుతున్నారు. ఈ సినిమా తనకు మధుర జ్ఞాపకంగా మిగులుతుందనుకుంటే.. పీడకల అయిందని వేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్లగక్కారు. అసలు విషయంలోకి వెళితే.. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో “ఆ గట్టునుంటావా… ఈ గట్టుకొస్తావా” అనే పాటను శివనాగులు పాడారు. ఆడియో ఈవెంట్ లో కూడా ఆయనను వేదికపైకి పిలిచి, ఆ పాటను పాడించారు. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంగా ఉన్న శివనాగులుకు సినిమా విడుదలయ్యాక షాక్ తగిలింది. వెండితెరపై ఆ పాటలో శివనాగులు వాయిస్ కాకుండా దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించడంతో శివనాగులకు కోపం కట్టలు తెచ్చుకుంది.
” చిన్న వేదికలపై పాటలు పాడుకునే నా గొంతు ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుందని ఆనందపడ్డాను. అయితే సినిమా విడుదలయ్యాక నా వాయిస్ లేకపోవడం నన్ను బాధ పెట్టింది. నా గొంతును మార్చుతున్నట్టు ఒక్క మాటైనా చెప్పి ఉంటే బాగుండేది” అని శివనాగులు మీడియా ముందు వాపోయారు. ఇంకా మాట్లాడుతూ.. “ఆడియో ఫంక్షన్ లో నాపై ప్రశంసలు కురిపించిన దేవిశ్రీ ప్రసాద్. పది రోజుల్లోనే తన ఆశలపై నీళ్లు చల్లారని,ఇలాంటి ఘటనలు ఇకపై మరెవ్వరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే నేను మీడియా ముందుకు వచ్చా” అని స్పష్టం చేశారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కి శివనాగులు వాయిస్ కి సింక్ కాకపోవడం వల్లే షూటింగ్ టైంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ గొంతు ఉన్న పాటనే సినిమాలో పెట్టాల్సి వచ్చిందని సుకుమార్ రిలీజ్ రోజే స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ శివనాగులు మీడియా ముందుకు రావడం అతను ఎంతగా బాధపడుతున్నాడో అనే విషయాన్నీ తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో కూడా శివనాగులకే ఎక్కువమంది సపోర్ట్ గా నిలవడం విశేషం.