ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టుని ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రభు అయన సోదరుడు రామ్ కుమార్ లపై వారిద్దరి సోదరీమణులు శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిగ్గజ నటుడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కి ప్రభు, రామ్ కుమార్ అనే ఇద్దరు కొడుకులు శాంతి, రజ్వీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
శివాజీ గణేశన్ మరణించిన ఇరవై ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్త కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్ కుమార్ లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తండ్రి మరణం తరువాత రూ.271 కోట్ల ఆస్తిని సరిగ్గా పంచలేదని వారు ఆరోపిస్తున్నారు. తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
అంతేకాదు.. తమకు తెలియకుండా ఆస్తులను కూడా అమ్మేశారని.. ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని కోర్టుని కోరారు. అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్ కుమార్ దాచేయడమే కాకుండా.. శాంతి థియేటర్ ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారి పేరు మీద మార్చుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు.