తల్వార్ సుమన్ గౌడ్.. ఇలా చెబితే ఎవరికీ అర్థం కాదేమో.. అదే సుమన్ అంటే వెంటనే మన తెలుగు నటుడా అంటారు ప్రేక్షకులు. నిజానికి కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే ఈయన్ని ఆదరించారు. ఈయనకి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టింది మన తెలుగు ప్రేక్షకులే. అప్పట్లో ఈయన వరుస విజయాలు అందుకున్న హీరోగా సుమన్ నిలిచేవారు. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు ల తర్వాత సుమనే స్టార్ హీరోగా రాణించేవారు.
ఆయన తర్వాతే చిరంజీవి, బాలకృష్ణ ఉండేవారు. కానీ ఓ కేసులో సుమన్ ఇరుక్కోవడం… దాంతో ఆయన జైలుకి వెళ్ళడం అప్పట్లో సంచలనమైంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో ఇలా జరగడం ఆయన దురదృష్టకరం. ఆ టైములో ఈయన చేయాల్సిన క్రేజీ ప్రాజెక్టులను హీరో రాజశేఖర్ తో తెరకెక్కించారు కొందరు దర్శకులు. ఇక జైలు నుండీ సుమన్ బయటకి వచ్చాక ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆయన డిప్రషన్ కు వెళ్ళిపోయారు.
ఆ టైములో ‘కారు దిద్దిన కాపురం’, ‘గుండమ్మ కథ’, ‘రాముడు భీముడు’, ‘యమగోల’ వంటి సూపర్ హిట్ సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేసిన డి.వి.నరసరాజు గారు తన మనవరాలు శిరీషను సుమన్ కు ఇచ్చి పెళ్ళి చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం షాకైంది. సుమన్ నిజంగానే తప్పు చేసి జైలుకి వెళ్ళి ఉంటే రాజుగారు తన మనవరాల్ని ఇచ్చి ఎందుకు పెళ్ళి చేస్తారు.? అంటూ సుమన్ పై పాజిటివిటీ పెరిగింది.
తర్వాత సుమన్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ‘చిన్నల్లుడు’ ‘పెద్దింటి అల్లుడు’, ‘పరువు ప్రతిష్ట’, ‘బావ బావమరిది’, ‘అబ్బాయిగారి పెళ్లి’ వంటి చిత్రాలతో కొన్నాళ్ళు హీరోగా కొనసాగారు. అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు సుమన్ గారు. సుమన్ గారికి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే భానుచందర్ పేరు చెప్పాలి.