ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ తర్వాత ఆస్థాయి హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విజయ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే హంగామా మాములుగా ఉండదు. కరోనా & లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేక ఆగిపోయిన పెద్ద సినిమాల్లో విజయ్ “మాస్టర్” ఒకటి. “ఖైదీ” ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినప్పటికీ.. థియేటర్ రిలీజ్ వైపు మొగ్గు చూపడంతో ఇండస్ట్రీ వర్గాలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి థియేటర్లకు 50% ఆక్యుపెన్సీ నిబంధనను తొలగించాలని, ఇదివరకటిలా అన్నీ టికెట్లు సేల్ చేసేలా రూల్స్ మార్చాలని కోరాడు. అసలే కరోనా సెకండ్ వేవ్ మొదలై ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే..
వైరస్ వ్యాపించడానికి అన్ని రకాలుగా పాజిబిలిటీ ఉన్న థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయకుండా మొత్తం టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్లు అడగడం అనేది విజయ్ వ్యక్తిత్వానికి తార్కాణంగా నిలిచింది. దాంతో.. ప్రజల ప్రాణాలకంటే, కలెక్షన్స్ హీరోగారి ఎక్కువైపోయాయి అని విజయ్ మీద కస్సుమన్నారు నెటిజన్లు. విజయ్ మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దాన్ని ఉపసంహరించుకునే ఆలోచన ఏమైనా ఉందా అనేది చూడాలి. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో ఫుల్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే.