ఒక సినిమా నిర్మిస్తున్నారు అంటే నిర్మాతలు ముఖ్యంగా కోరుకునేది భారీ లాభాలు మాత్రమే కాదు.. సదరు సినిమా తాము స్థాపించిన బ్యానర్ నిర్మించింది అనే క్రెడిట్. చరిత్రలో తమ బ్యానర్ కు ఆ గొప్పదనం ఉండాలి అనే క్రేజీ కాంబినేషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మన నిర్మాతలు. కానీ.. ఆ క్రెడిట్ ను షేర్ చేసుకోవాల్సి వస్తే అంతకుమించిన బాధ మరొకటి ఉండదు. ప్రస్తుతం ఆ వింత బాధను పడుతున్న ప్రొడక్షన్ హౌజ్ “హారిక & హాసిని క్రియేషన్స్”. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వరుస సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ నిర్మించిన మునుపటి చిత్రం “అల వైకుంఠపురములో” సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాక ఇప్పటికీ థియేటర్లలో హల్ చల్ చేస్తూనే ఉంది.
అయితే.. ఇంతటి అఖండ విజయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థతో కలిసి షేర్ చేసుకోవాల్సి వచ్చింది హారిక & హాసిని సంస్థకు. నిన్న ఎనౌన్స్ చేసిన “ఎన్టీఆర్ 30” సినిమా పరిస్థితి కూడా అంతే. ఈ చిత్రాన్ని యన్.టి.ఆర్ ఆర్ట్స్ తో కలిసి నిర్మిస్తోంది హారిక్ & హాసిని సంస్థ. ఇలా వరుసబెట్టి క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూ.. భారీ హిట్స్ కొడుతున్నప్పటికీ.. సదరు సినిమాల క్రెడిట్స్ మాత్రం వేరే ప్రొడక్షన్ హౌజ్ లతో షేర్ చేసుకోవాల్సి రావడం గమనార్హం. ఇక ఇప్పుడు ప్రతి హీరోకి సొంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి కాబట్టి ఇకపై హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించే సినిమాలన్నిటి పరిస్థితి ఇంతేనేమో.