నటుడిగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి చక్కటి గురించి తెచ్చుకున్న సోనూసూద్ లాక్ డౌన్ లో ఎన్నో సర్వా కార్యక్రమాలు చేసి మానవత్వం చాటుకున్నాడు. ముందుగా వలస కార్మికులతో మొదలుపెట్టి ఎంతోమందిని ఆదుకున్నాడు. లాక్ డౌన్ పూర్తయిన తరువాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. తనను సాయం కోసం వేడుకుంటున్న వాళ్ల వివరాలను తెలుసుకొని తన టీమ్ ద్వారా సాయపడుతున్నాడు. దీనికి ప్రధానంగా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది.
అయితే నేరుగా సోనూని కలిసే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. సోనూ ముంబైలో తన ఇంటి దగ్గర ఉన్నా.. లేదా బయట ఎక్కడైనా షూటింగ్ కి వెళ్లినా.. వివరాలు తెలుసుకొని అతడిని కలవడానికి వెళ్లి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు అభాగ్యులు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దగ్గరకు కూడా పదుల సంఖ్యలో జనాలు వస్తున్నారట. వందల కిలోమీటర్లు ప్రయాణించి సోనూని కలుస్తుండడం విశేషం.
సోనూతో పాటు అతడి టీమ్ కూడా ఉంటుంది. ఓ పక్క సోనూ టీమ్, మరోపక్క అతడిని సాయం కోరడం కోసం వచ్చే జనాలతో షూటింగ్ స్పాట్ మొత్తం కిక్కిరిసిపోతోందట. యూనిట్ లో ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి సోనూ చుట్టూ జనం ఉండడంతో.. ఆ ప్రాంతమంతా హంగామా కనిపిస్తోంది. కరోనా సమయంలో సైలెంట్ గా షూటింగ్ చేయాలనుకుంటే ఇలా జనాలు, గోలతో చిత్రబృందం ఇబ్బందిపడుతోందట. చాలా సమయం వృథా అవుతూ.. ఖర్చు పెరుగుతున్నా.. సోనూ మంచి మనసుని దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోతున్నారట.