జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత కఠినమయ్యాయి. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు, పెద్ద కార్యక్రమాలు కూడా రద్దవుతున్నాయి. ఇందులో భాగంగా పాపులర్ సింగర్స్ తమ మ్యూజికల్ ఈవెంట్స్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పటికే అర్జిత్ సింగ్ తన చెన్నై కాన్సర్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా శ్రేయా ఘోషల్ సైతం తన సూరత్‌లో జరగాల్సిన మ్యూజికల్ షోను క్యాన్సిల్ చేసింది.
శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) నిర్వహించాల్సిన ఈ కాన్సర్ట్ ఇప్పటికే భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ షోను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. టికెట్లు కొనుగోలు చేసినవారికి పూర్తి రీఫండ్ ఇస్తామని స్పష్టం చేశారు. పహల్గాం దాడి పట్ల శ్రేయా ఘోషల్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజల రక్షణే ముఖ్యమని భావిస్తూ తన షోను క్యాన్సిల్ చేసిన శ్రేయాను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ప్రస్తుతం శ్రేయా ఘోషల్ ‘ఆల్ హార్ట్స్ టూర్’ పేరుతో దేశ విదేశాల్లో మ్యూజికల్ టూర్ నిర్వహిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాల్లో షోలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. అయితే సూరత్ కాన్సర్ట్ రద్దు చేయడం శ్రేయా అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, పరిస్థితుల దృష్ట్యా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. త్వరలోనే కొత్త డేట్ గురించి నిర్వాహకులు అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక మరోపక్క సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కూడా తన ‘హుకూమ్ వరల్డ్ టూర్’లో భాగంగా బెంగళూరులో మే 31న కాన్సర్ట్ చేయబోతున్నాడు.
ఒక్క గంటలో టికెట్లు సేల్ అవడంతో అదనంగా జూన్ 1న మరో షో ఏర్పాటు చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. కానీ పహల్గాం దాడి కారణంగా రెండో రోజు షో టికెట్ సేల్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించనున్నట్టు అనిరుధ్ టీమ్ తెలిపింది. దేశంలో నెలకొన్న పరిస్థితులు అందరినీ ఆందోళనకు గురి చేస్తుండగా, ప్రజల రక్షణే ప్రాధాన్యమనే నెపథ్యంలో సంగీత కారులు తమ ఈవెంట్స్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలు అందరిలో ప్రశంసల వర్షం అందుకుంటున్నాయి.