టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో రెండు హిట్లు అందుకుంది శృతిహాసన్. తెలుగు, తమిళ సినిమాల్లోనే కాకుండా హిందీలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. నటిగానే కాకుండా.. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు అవుతుంది.
ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏ హీరోయిన్ అయినా.. తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం, సక్సెస్ కావడం అరుదుగా జరుగుతుంటుందని.. ఈ ఏడాది ఆ అదృష్టం తనకు దక్కిందని చెప్పింది. తన తొలి హిందీ సినిమా ‘లక్’ విడుదలై 14 ఏళ్లు పూర్తయిందని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తన కెరీర్ గురించి ఎక్కడా.. మాట్లాడొద్దని చాలా మంది చెప్పేవారని..
అలా చేస్తే ఆ ప్రభావం సినిమాపై పడుతుందని భయపెట్టేవారని గుర్తుచేసుకుంది. కానీ తను మాత్రం రెండింటికీ ప్రాముఖ్యతనిస్తూ.. ముందుకెళ్లానని తెలిపింది. మొదటిసారి మైక్ ముందుకు వచ్చిన సందర్భంగా తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పుకొచ్చింది. ఆరోజు నేనెలా పాడతానోనని నాన్న(కమల్ హాసన్) చాలా భయపడ్డారని చెప్పింది. కరోనా సమయంలో తన మ్యూజిక్ ప్రొఫెషన్ ని చాలా మెరుగుపరుచుకున్నట్లు తెలిపింది.
ఆ తరువాత స్టేజ్ షోలలో పాల్గొని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో చాలా ఆనందంగా అనిపించిందని వివరించింది. అలానే పాటలు రాయడం కూడా నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. అది దేవుడు తనకిచ్చిన వరమని.. మిగతా ప్రపంచంతో దానిని పంచుకోగలగడం అదనపు వరమని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.