సిద్ధార్థ్ (Siddharth).. తమిళనాడుకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. కోలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసినప్పటికీ సిద్దార్థ్ ను స్టార్ ని చేసింది తెలుగు ప్రేక్షకులే అని చెప్పాలి. ‘బాయ్స్’ (Boys) ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) ‘బొమ్మరిల్లు’ (Bommarillu) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యి.. సిద్ధార్థ్ కి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి కొన్ని ప్లాపులు ఎదుర్కొన్నాడు సిద్దార్థ్.
తర్వాత తప్పు తెలుసుకుని ప్రేమ కథలు చేశాడు. అవి టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే అందుకున్నాయి. అలాంటి వాటిలో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ (Konchem Ishtam Konchem Kashtam) సినిమా ఒకటి. పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘గోపాల గోపాల’ (Gopala Gopala) ‘కాటమరాయుడు’ (Katamarayudu) వంటి సినిమాలు తీసిన కిషోర్ పార్థసాని(డాలి) (Kishore Kumar Pardasani) తెరకెక్కించిన సినిమా ఇది.’శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి నిర్మించారు.
2009 వ సంవత్సరంలో ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా ఉంది అని ప్రేక్షకులు పెదవి విరిచారు. ‘గచ్చిబౌలి దివాకర్’ గా బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ రిలీఫ్ ఇచ్చినా.. అది పూర్తిస్థాయిలో కాదు. అయినప్పటికీ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించింది.
విచిత్రం ఏంటంటే.. అదే ఏడాది విడుదలైన ప్రభాస్ (Prabhas) ‘ఏక్ నిరంజన్’ కి (Ek Niranjan) యావరేజ్ టాక్ వచ్చినా.. అది కేవలం రూ.12.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) ‘ఆర్య 2’ (Arya 2) సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.13.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇలా ఆ ఏడాది సిద్దార్థ్ (Siddharth).. ప్రభాస్, అల్లు అర్జున్..ల పై పైచేయి సాధించి ట్రేడ్ వర్గాలకి షాకిచ్చాడు.