పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ (OG Movie) సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా నుండి సరైన అప్‌డేట్ అయితే లేదు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ను అడగ్గా.. సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యాక ఇస్తామని క్లియర్‌గా చెప్పేశారు. అయితే రీస్టార్ట్ అవ్వగానే వచ్చే అప్‌డేట్ ఏంటి అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఆ విషయాన్ని సినిమా సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) చెప్పేశారు.
పవన్ కల్యాణ్ సినిమాల లైనప్‌లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ త్వరలో విడుదల అనే ఫీలింగ్ కలిగించిన సినిమా ‘ఓజీ’. సినిమా నుండి వచ్చిన టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. దాంతో సినిమా కోసం మొత్తం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాను లైనప్‌లో దాని యథాస్థానంలో (మొదటి స్థానంలో) పెట్టి ఆ సినిమానే పట్టాలెక్కించి ఇప్పుడు రిలీజ్ చేయడానికి అన్ని ప్లాన్స్ చేస్తున్నారు. దీంతో ‘ఓజీ’ కోసం వెయిటింగ్ తప్పనిసరి అయింది.
ఎప్పుడైతే సినిమా షూటింగ్ ఆగిందో అప్‌డేట్స్ కూడా ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ దగ్గర ప్రస్తావిస్తే.. తమ సినిమా బ్యాలన్స్ షూటింగ్ మొదలైనప్పుడు ఆ రోజు గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కి ‘ఓజి’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రామ్..’ని విడుదల చేస్తామని చెప్పేశారు. ఆ పాటను తమిళ హీరో శింబు (Simbu) పాడాడని చెప్పారు. నిజానికి శింబు పాట పాడిన విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే సినిమా టీమ్ నుండి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
‘ఓజీ’ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఇది మరో ఎక్స్‌ట్రా ఆసక్తికర అంశం అని చెప్పొచ్చు. సినిమా ఎప్పుడొస్తుంది అనే పాయింట్‌తో పాటు ‘ఫైర్ స్ట్రామ్..’ పాట కూడా చేరింది.