రెండు సినిమాల మధ్య పోలికలు ఉండటం కామన్. అందులోనూ మాస్ సినిమాల విషయంలో ఆ పోలికలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ప్రాథమిక కథ విషయంలో పోలికలు ఇంకా సహజం. ఇప్పుడు ఈ విషయంలోనే ‘పుష్ప’కు ‘కేజీఎఫ్’కు పోలికలు కనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏంటా పోలికలు, ఎందుకలా అనిపిస్తోంది అనేది ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది. ‘కేజీఎఫ్’ సినిమాలో విలన్లు అందరూ కలసి గోల్డ్‌మైన్స్‌ను కొల్లగొడుతుంటారు. హీరో వాళ్లలో కలసిపోయి…
వారినే అంతమొందించి ఆ మొత్తం సామ్రాజ్యానికి నాయకుడు అవుతాడు. ‘పుష్ప’ విషయంలో బయటకు వచ్చిన కథను చూస్తుంటే… అలానే అనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సుకుమార్ అండ్ కో ఎప్పుడో చెప్పేశారు. ఈ సినిమాలో విలన్ల మధ్యలోనే ఉంటూ హీరో… ఎర్రచందనం సామ్రాజ్యానికి అధిపతి అవుతాడట. ఈ పాయింటే ఇప్పుడు రెండు సినిమాలకూ పోలిక చూసేలా చేస్తోంది. దీంతోపాటు ఈ సినిమా తొలి భాగం ఆఖరులో మెయిన్ విలన్ ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడట. సెకండాఫ్‌లో పూర్తి స్థాయిలో పాత్ర ఉంటుంది.
అందుకుతగ్గట్టుగా సినిమాలో చాలామంది విలన్లు ఉంటారని, వాళ్లంతా ఫస్టాఫ్‌లోనే వస్తారట. ‘కేజీఎఫ్’లో కూడా ఫస్ట్‌పార్ట్‌లో చాలామంది విలన్లు ఉన్నారు. సెకండ్ పార్ట్‌లో సంజయ్ దత్ మెయిన్ విలన్ అట. ఇదంతా చూస్తే… సినిమా మెయిన్ పాయింట్ ఒకటే. ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సుకుమార్ స్టైల్ గురించి మనకు తెలిసిందే కదా. కాబట్టి తెలిసిన మెయిన్ పాయింట్ అయినా… తనదైన శైలిలో తీస్తాడు.