ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య లక్ష్మీ కల్యాణి ఇటీవల తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు సింగీతం సన్నిహితులు తెలిపారు. 62 ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది అంటూ సింగీతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీ కల్యాణి వివాహం 1960లో జరిగింది. తన సినీ కెరీర్‌లో లక్ష్మీ కల్యాణి కీలక పాత్ర పోషించారని గతంలో సింగీతం పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆమె ఆయనకు సహాయం చేసేవారట. లక్ష్మీ కల్యాణి గురించి సింగీతం ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకం రాశారు. సింగీతం కుటుంబానికి సన్నిహితులు, సినిమా జనాలు సానుభూతి తెలియజేస్తున్నారు. సింగీతం విషయానికి వస్తే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సందేశాత్మక, ప్రయోగాత్మక, కథాభరితమైన సినిమాలు చేస్తూ వచ్చారు.
వైవిధ్యాన్ని పెద్ద పీట వేశారు ఆయన సినిమాల్లో. వయసు పెరిగిన కారణంగా సింగీతం ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్‌ల ‘ప్రాజెక్ట్ K’ (వర్కింగ్ టైటిల్) సినిమాకు తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ బాధ్యతల నుండి తప్పుకున్నారు.
కారణాలు చెప్పలేదు కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన దూరంగా ఉన్నారని చెబుతుంటారు. దర్శకుడిగా ఆయన నుండి వచ్చిన ఆఖరి చిత్రం ‘వెల్‌కమ్ ఒబామా’. సరోగసీ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘కంచె’.