మల్టీప్లెక్స్ ల హవా మొదలైన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లపై ఎఫెక్ట్ బాగా పడింది. గతంలో మూడు వేలకి పైగా ఉన్న సింగిల్ స్క్రీన్ లు ఇప్పుడు 1600 లకు పడిపోయాయి. ఈ సంఖ్య మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లోనే దాదాపు పది థియేటర్లు మూతపడ్డాయి. షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోయాయి. ఇప్పుడు మరిన్ని థియేటర్లు గొడౌన్ లుగా మారే అవకాశం ఉంది. తాజాగా అమెజాన్ సంస్థ సింగిల్ స్క్రీన్ లపై దృష్టి పెట్టింది. వాటిని గొడౌన్లుగా మార్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తుంది.
కేవలం హైదరాబాద్ లోనే దాదాపు 30 థియేటర్లను అమెజాన్ సొంతం చేసుకోబోతుందని.. అవి త్వరలోనే అమెజాన్ గొడౌన్లుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. సౌత్ ఇండియాకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ చేసుకుంది అమెజాన్. అన్ని ఏరియాలకు సరుకు సప్లై చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి అమెజాన్ కి కొన్ని గొడౌన్లు అవసరం అయ్యాయి. అందుకే మూతబడడానికి సిద్ధంగా ఉన్న థియేటర్లను ఎన్నుకుంది. ప్రస్తుతం థియేటర్ యజమానులతో ఈ విషయంపై అమెజాన్ సంస్థ సంప్రదింపులు జరుపుతోంది.
సినిమాల ప్రసారం చేస్తే ఇచ్చే అద్దె కంటే ఎక్కువ అద్దె చెల్లించడానికి మీర్జాన్ సిద్ధమైందట. అందుకే థియేటర్ యజమానులు కూడా అమెజాన్ కి లీజుకి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇదే విషయాన్ని తెలంగాణ థియేటర్ యాజమాన్య సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని.. వాటిలో చాలా థియేటర్లు గొడౌన్లుగా మారబోతున్నాయని చెప్పారు.