‘లియో’తో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిద్యభరిత, ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. వారు పాన్ ఇండియా స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇతర భాషలకు చెందిన వివిధ అగ్ర నటులతో కూడా చేతులు కలుపుతున్నారు.

ఇటీవల, వారు ధనుష్ యొక్క ‘సార్'(వాతి)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు, వారు దళపతి విజయ్ మరియు సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న భారీ అంచనాలు కలిగిన చిత్రం ‘లియో’లో భాగస్వాములు కాబోతున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిక్‌లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి ప్రముఖ దర్శకులు కూడా నటిస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, జాఫర్ సాదిక్, మడోన్నా సెబాస్టియన్, అనురాగ్ కశ్యప్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

ఇటీవలే చిత్ర బృందం షూటింగ్‌ను పూర్తి చేసింది. దాదాపు 125 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో ప్రధానంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్ మాస్టర్స్‌ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది.

అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలవనుంది. ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ‘మాస్టర్’ లాంటి సంచలన ఆడియో వచ్చింది. అదే స్థాయిలో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘లియో’ నుంచి విడుదలైన ‘నా రెడీ’ అనే మొదటి పాటకు విశేష స్పందన లభించింది.

ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 అక్టోబర్ 19న విడుదలవుతోంది.

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొంది ప్రశంసలు పొందిన ‘మాస్టర్‌’ చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఎస్. లలిత్ కుమార్ ‘లియో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్టర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన జగదీష్ పళనిసామి ఈ యాక్షన్ బొనాంజాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.

ఈ యాక్షన్ ఎపిక్‌కి సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస, ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus