శివశంకర్ మాస్టర్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా… ఇంకా ఏదో కొత్త విషయం ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమలో ఆయన ప్రస్థానం అలాటిది. 16 ఏళ్లకే డ్యాన్స్ ట్రూపులో చేరి… నృత్యాన్ని ఒంటబట్టించుకున్నారాయన. తన జీవన ప్రయాణ ముగింపు కూడా డ్యాన్స్ చేస్తుండగానే ఉండాలని కోరుకున్నారు. అంతగా డ్యాన్స్ అంటే పిచ్చి ఆయనకు. అలాంటి ఆయన చిన్నతనంలో ఎనిమిదేళ్ల పాటు మంచం మీదే ఉండిపోయారంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. ఒకసారి ఆయనే ఈ విషయం చెప్పుకొచ్చారు.
శివశంకర్ మాస్టర్‌కు ఒకటిన్నరేళ్లు ఉన్నప్పుడు… వాళ్ల పెద్దమ్మ ఒళ్లో కూర్చోబెట్టుకుని ఇంటి అరుగు మీద కబుర్లు చెప్పుకుంటున్నారట. సరిగ్గా అదే సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని మీదకు వచ్చేసిందట. దీంతో ఒక్క ఉదుటన లేచి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లారట. ఈ క్రమంలో ఒడిలో ఉన్న బిడ్డ గుమ్మం దగ్గర పడిపోయాడు. దీంతో వెన్నెముక విరిగిపోయిందట. వైద్యుడి వద్దకు తీసుకెళ్తే… ఎక్స్‌రే తీసి వెన్నెముక విరిగిపోయిందని చెప్పారట. వైద్యం తీసుకుంటూ… దాదాపు ఎనిమిదేళ్లు మంచంపై పడుకునే ఉన్నానరట.
మాస్టారు వాళ్ల నాన్నకు పాటలంటే ప్రాణమట. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి మరీ పంపేవారట. అలా చూసీ చూసీ… పాటలపై వ్యామోహం పెరిగిందట. డ్యాన్స్‌లు చేయాలన్న పట్టుదల కలిగిందట. దీంతో 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేసేవారట. విషయం తెలిసి ఇంట్లో వాళ్లు బాగా తిట్టారట. దీంతో ఎలాగోలా ఎస్సెల్సీ పూర్తి చేశారట శివశంకర్ మాస్టర్. చదువు అయిపోయింది కదా ఏం చేస్తావ్ అని ఇంట్లో అడిగారట. ‘డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట మాస్టర్. అలా మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద నృత్యం నేర్చుకున్నారట. ఆ తర్వాత సలీమ్ మాస్టర్ దగ్గర దగ్గర సహాయకుడిగా చేరాను. ఆ తర్వాత ప్రముఖ నృత్య దర్శకుడిగా ఎదిగారు.