Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు
- September 8, 2026 / 06:03 PM ISTByPhani Kumar
సినిమా,రాజకీయం.. ఈ రెండిటికీ విడదీయరాని బంధం ఉంది. ఎంతో మంది సినీ తారలు వెండితెరపై అలరించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తమ సత్తా చాటారు. సీనియర్ ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత వంటి వారు సృష్టించిన సంచలనాలు ఎలాంటివో కూడా అందరికీ తెలుసు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఒక దర్శకుడితో పనిచేసిన ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. స్వయంగా వీరితో సినిమాలు తీసిన దర్శకుడు ఈ విషయాన్ని రివీల్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
Kushi

ఆ హీరోలు మరెవరో కాదు ఒకరు పవన్ కళ్యాణ్, ఇంకొకరు విజయ్. ఇక వీరితో సినిమా తీసిన దర్శకుడు ఇంకెవ్వరో కాదు ఎస్ జె సూర్య. అవును ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘ఖుషి'(Kushi). తమిళంలో దళపతి విజయ్ తో ఈ సినిమాని తీశాడు ఎస్ జె సూర్య. అక్కడ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేశాడు సూర్య. తమిళ వెర్షన్ కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది తెలుగు ‘ఖుషి’.
అయితే విచిత్రంగా తెలుగు ‘ఖుషి’లో నటించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎంగా ఎదిగాడు. మరోవైపు తమిళ ‘ఖుషి’ లో హీరోగా నటించిన విజయ్ సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అదీష్టించాడు. అయితే ఈ హీరోలకి ‘ఖుషి’ లింక్ ఉందని దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య చెప్పడం జరిగింది. అతను విలన్ గా నటించిన ‘సర్దార్ 2’ ఈ సెప్టెంబర్ 10న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కామన్ ఇంటర్వ్యూని మంచు మనోజ్ హోస్ట్ చేయగా, హీరో కార్తీ,ఎస్ జె సూర్య ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ… “నా కెరీర్ లో అజిత్, విజయ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో పనిచేశాను. అయితే నేను డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల గురించి చెప్పాలి. వారిలో ఒకరు(పవన్ కళ్యాణ్) డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకొకరు(విజయ్) సీఎం అయిపోయారు” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.














