‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాను అర్జెంట్ పైకి లేపాల్సి ఉంది. ఎందుకంటే వాళ్లు చెబుతున్నట్లు సినిమా క్రిస్‌మస్ రిలీజ్ చేయాలి. అంటే మూడు నెలలు ఉంది. దీంతో సినిమా టీమ్ చాలా నెలలుగా చెబుతున్న రెండో పాటను రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో ఎంతో భారీగా తెరకెక్కిన పాట ఒకటి ఉందని చాలా రోజులుగా సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) చెబుతున్నారు. ఆ పాటను ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్‌తో కలసి దర్శకుడు శంకర్ (Shankar) ఓ ఇంటర్వ్యూలో లాంటి వీడియో రిలీజ్ చేశారు.
ఆ పాట కోసం తాము పడ్డ కష్టాన్ని వివరిస్తూనే.. పాట ఎందుకంత స్పెషల్ అనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుండి సంప్రదాయ సంగీత కళాకారులను తీసుకొచ్చిన విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఒక్కో సంగీతం గురించి వివరించే క్రమంలో వీడియోలో ఆ ప్రాంతం పేర్లు రాశారు. అయితే, ఆ పేర్లు ఇచ్చేటప్పుడు టీమ్ క్రాస్ చెక్ చేసుకోలేదేమో.. రాష్ట్రాల పేర్లు తప్పుగా పడ్డాయి. అక్కడ శంకర్ చెబుతున్న రాష్ట్రం పేరు ఒకటి అయితే.. ఇక్కడ స్క్రీన్ మీద వేరేది కనిపిస్తోంది.
ఇంకో దగ్గర తెలంగాణ ప్రాంతంలోని సంగీతం గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ ప్రాంతం సంగీతం గురించి ఆంధ్రప్రదేశ్ అని రాయడం, చెప్పడం సరికాదు అనిపిస్తోంది. శంకర్‌కు ఈ విసయం గురించి తెలియకపోవచ్చు. నిర్మాణ సంస్థ అయినా వీడియోను చెక్ చేయాలి కదా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పీఆర్ టీమ్ రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో జిల్లాల పేర్లు, రాష్ట్రం పేర్లు సరిగ్గానే ఇచ్చారు. ఏదో వీడియో రిలీజ్ చేయాలనే తొందరలోనే ఇలా జరిగింది అని అర్థమవుతోంది.
అయితే ఇంకా ప్రచారం చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం ‘గేమ్ ఛేంజర్’. ఇన్ని చెప్పారు అవేంటో చెప్పలేదు అని అనుకుంటున్నారా? ఆదిలాబాద్‌కి చెందిన గుస్సాడీ గురించి చెప్పినప్పుడు ఏపీ అని రాశారు. ఒడిశాలోని గుమ్రా అని శంకర్ చెబుతుంటే.. స్క్రీన్ మీద కర్ణాటక అని రాశారు. జార్ఖండ్ చెందిన పైకా గురించి చెబుతుంటే దిగువన ఒడిశా అని రాశారు. మరి ఈ విషయం తెలిశాక టీమ్ ఏమన్నా ఎడిట్ చేసుకుంటుందేమో చూడాలి.