త్రివిక్రమ్ సినిమాలో మనవైన అనుబంధాలు ఉంటాయి, మనసుకు హాయిగా ఉంటే లైట్ కామెడీ ఉంటుంది, అలాగే వినసొంపైన పాటలు ఉంటాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం రీమేక్ సీన్స్ ఉంటాయి. అదేంటి అనుకుంటున్నారా? కావాలంటే ఓసారి మీరే రివైండ్ చేసుకోండి. ఆయన సినిమాల్లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఎక్కడో హాలీవుడ్ సినిమాల నుండి, కొరియన్ సినిమాల నుండి ఎత్తేసుంటారు. గతంలో చాలామంది ఈ విషయంలో యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు. ఇప్పుడు మీరు వెతికినా దొరుకుతాయి.
అయినా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారు కదా? ఇన్నాళ్లూ ఎలాగో ఆయన మాటల మేజిక్‌తో నడిచిపోయింది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు ఆయన అల్లు అర్జున్‌తో కలిపి బాలీవుడ్ వెళ్లబోతున్నారు. అక్కడ ఇలా సీన్స్ ఎక్కడి నుండో స్ఫూర్తి పొంది తీస్తే జనాలు గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే మన దగ్గర త్రివిక్రమ్ మేజిక్‌లు వర్కవుట్ అవుతున్నాయి కానీ.. నార్త్‌లో ఆయన కథలకు అంత పెద్ద బజ్ లేదు. ఆయన సినిమాలు అక్కడ రీమేక్ చేస్తే విజయం దక్కడం లేదు.
దీంతో ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేసే సినిమాలో ఇలాంటి సీన్స్ లేకుండా ఉంటే బాగుంటుంద అనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ సినిమాను ‘మహాభారతం’ ఆధారంగా తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మహాభారతంలోని రెండు పర్వాలను ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ కథను సిద్ధం చేశారని భోగట్టా. పురాణాల్లోని డైలాగులను, పాత్రల పేర్లను సినిమాల్లో పెట్టడం త్రివిక్రమ్‌కు అలవాటే. ఇప్పుడు ఏకంగా మహాభారతం బేస్ చేసుకుని కథంతా రాస్తున్నారని టాక్.
ఇక త్రివిక్రమ్ (Trivikram) ప్రాజెక్టుల గురించి చూస్తే.. ఆయన అన్నీ తానై సిద్ధం చేసిన ‘బ్రో’ సినిమా ఈ నెలాఖరుకు వస్తుంది. మహేష్‌బాబుతో సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. ఇక బన్నీ సంగతి చూస్తే ప్రస్తుతం ‘పుష్ప 2’ అవుతోంది. ఆ తర్వాతే త్రివిక్రమ్ సినిమా.