రియల్ హీరో సోనూసూద్ కష్టాల్లో ఉన్న వేల సంఖ్యలో ప్రజలకు సహాయం చేశారు. రోజుకు కనీసం 40,000 విజ్ఞప్తులు వస్తున్నాయని సోనూసూద్ చెబుతున్నారంటే కరోనా వల్ల ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో సులభంగా అర్థమవుతుంది. చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెడుతున్న సోనూసూద్ కు ఏడాది కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం భారీగా పెరిగింది. ట్విట్టర్ లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నటులలో సోనూసూద్ ఒకరు. అయితే సోనూసూద్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు సోనూసూద్ ఏడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు తీసుకుంటున్న పారితోషికం కంటే సోనూసూద్ తీసుకుంటున్న పారితోషికం ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. గతేడాది వరకు సోనూసూద్ ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నారు. ఈ ఏడాది రిలీజైన అల్లుడు అదుర్స్ సినిమాకు సోనూసూద్ రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని భోగట్టా.
అయితే సోనూసూద్ కు ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడతారో లేదో చూడాల్సి ఉంది. సోనూసూద్ కు ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ ఆ అభిమానంతో సోనూసూద్ నటించిన సినిమాలు చూస్తారా..? అంటే కచ్చితంగా చూస్తారని చెప్పే పరిస్థితి లేదు. సోనూసూద్ 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్లే బోయపాటి శ్రీను బాలయ్య సినిమాలో ఛాన్స్ మిస్ అయిందని తెలుస్తోంది.