కరోనా కాలంగా నటుడు సోనూసూద్ చేసిన సేవల గురించి అంత తేలికగా మర్చిపోలేం. కష్టాల్లో ఉన్నవారిని ఆడుకొని అండగా నిలిచారు. చాలా మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వలస కార్మిలకులను వారి సొంతూళ్లకు చేర్చడం కోసం సోనూ చాలా కష్టపడ్డారు. దేశం మొత్తం కూడా సోనూ చేసిన సేవలను కొనియాడింది. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సోనూసూద్ ని అభినందించారు. ఆయనకి సత్కారాలు చేశారు. అయితే ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేసింది.
అంతేకాదు.. ‘ఏ సెల్యూట్ టు సేవియర్ సోనూసూద్’ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే మొదటిసారి. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్,స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా 2.5 లక్షల మంది భారతీయులను సొంతూళ్లకు చేర్చారు. రష్యా, యుజెబికిస్థాన్ లాంటి దేశాల్లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు. సోనూసూద్ చేసిన సేవలకు గాను..
స్పైస్ జెట్ సంస్థ తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంది. ఇంతటి గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉందని సోనూసూద్ అన్నారు. పంజాబ్ నుండి ముంబైకి రిజర్వేషన్ లేని టికెట్ తో ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని.. ఈ సమయంలో తన తల్లితండ్రులను మిస్ అవుతున్నానని ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఇకపై ఇలానే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేస్తానంటూ చెప్పుకొచ్చారు.