ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన తొలి సినిమాలు అంటే ‘బాహుబలి’ (Baahubali) చిత్రాలే అని చెప్పాలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ఆ రెండు సినిమాలు అదిరిపోయే విజయాన్ని, అబ్బురపరిచే వసూళ్లను అందుకున్నాయి. ఈ సినిమాకు ఇప్పడు మూడో పార్టు వస్తోంది. అదేంటి మూడో ‘బాహుబలి’ వస్తోంది ఇంత కూల్‌గా చెబుతున్నారు అనుకున్నారా? రియల్ సినిమా అయితే అలాగే చెప్పేవాళ్లం. ఇక్కడ వస్తోంది యానిమేటెడ్ సినిమా కాబట్టి ఆ రేంజిలో చెబుతున్నాం.
‘బాహుబలి 3’ సినిమా ఉంది అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవి పుకార్లే అవ్వొచ్చు అని లైట్ తీసుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఇప్పుడు చిత్ర దర్శకుడు రాజమౌళి అప్‌డేట్ ఇచ్చారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఇదే ‘బాహబలి 3’. త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ విడుదలవుతుందట. ‘మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, విశ్వంలోని ఏ శక్తీ అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు.
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది’ అని రాజమౌళి ఎక్స్ (మాజీ ట్విటర్) వేదికగా ప్రకటించారు. ‘బాహుబలి’ సినిమాను వివిధ రూపాల్లో తీసుకొచ్చే అవకాశం ఉందని రాజమౌళి గతంలోనే చెప్పారు కూడా. అందుకు తగ్గట్టే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలతో ఆనంద్ నీలకంఠన్ ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే పుస్తకం రాశారు కూడా. ఇప్పుడు రాజమౌళి మూడో ‘బాహుబలి’ని యానిమేటెడ్ సిరీస్‌గా తీసుకొస్తున్నారు.
మరి ఇందులో ఏ అంశాలను చూపిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఏ పాత్రలు ఉంటాయి, కొత్త పాత్రలు ఏంటి అనేది చూడాలి. వాటన్నింటికి మించి ఈ సినిమాలో రాజమౌళి వాడే టెక్నాలజీ ఏంటి? అదెలా ఉండబోతోంది అనే చర్చ కూడా సాగుతోంది. మామూలు సినిమాలకే ఆయన విజువల్ ఎఫెక్ట్స్ ఓ లెవల్‌లో వాడతారు. మరిప్పుడు యానిమేషన్ సిరీస్ కదా… అది పీక్స్‌లోనే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఒక మాట మహేష్ (Mahesh Babu) సినిమా కంటే ముందే రాజమౌళి నుండి ఈ ప్రాజెక్ట్ వస్తోంది మరి.