తమన్ (SS Thaman) చాలా సరదా సరదాగా ఉంటాడు. ఆయన కేవలం సంగీత దర్శకుడిగా మాత్రమే ఉన్నప్పుడు మనకు ఈ విషయాలు పెద్దగా తెలిసేవి కావు. అయితే ఆయన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఓటీటీ షోకి జడ్జిగా మారినప్పటి నుండి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆయన కష్టాలు, ఇష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు .. ఇలా అన్నీ ఏదో సందర్భంలో బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన చిన్ననాటి సరదాలు బయటికొచ్చాయి. ‘తెలుగు ఇండియన్ ఐడల్ – 3’ ఈ వారం ఎపిసోడ్‌లకు తమన్ మాతృమూర్తి ఘంటసాల సావిత్రి వచ్చారు.
SS Thaman
ఈ క్రమంలో తమన్ గురించి చెప్పండి అంటే.. ఆమె వరుసపెట్టి పూస గుచ్చినట్లు చాలా విషయాలు చెప్పేశారు. ఈ క్రమంలోనే తమన్ చిన్ననాటి తుంటరి పనులు అన్నీ బయటకు వచ్చాయి. తమన్‌ను ఇంట్లో సాయి అని పిలుస్తారు అని ఆమెనే చెప్పారు. తమన్, ఎస్ ఎస్ తమన్ అని మాత్రమే చాలామంది తెలిసిన పేర్లు. ఆయన పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ అని ఈ ఎపిసోడ్ ద్వారా తెలిసింది.
ఇక తమన్ చిన్నతనంలో క్లాస్ రూమ్‌లో కంటే ప్లే గ్రౌండ్‌లోనే ఎక్కువగా వుండేవాడని సావిత్రి తెలిపారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని, సాయంత్రం అయితే క్రికెట్ ఆడటానికి వెళ్లిపోతుంటాడని ఆమె తెలిపారు. చిన్నతనంలో తమన్ చాలా అల్లరి చేసేవాడని.. ఎవరన్నా, ఏమన్నా అంటారు అనే భయం ఉండేది కాదని, స్కూల్‌లో గొడవలు పెట్టుకునేవాడని కూడా ఆమె చెప్పారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్‌లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్‌లు కూడా వచ్చేవని ఘంటసాల సావిత్రి చెప్పారు.
ఇలా అల్లరి చేస్తున్నాడని, స్కూలు మారిస్తే లేడీస్ స్పెషల్‌లో స్కూలుకు వెళ్లేవాడని ఆమె నవ్వేశారు. అయితే, ఇలా ఎన్ని చేసినా హార్డ్ వర్కర్ అనీ, ఏదైనా పని మొదలుపెడితే దానిని పూర్తి చేసేవరకు వదిలేవాడు కాడని కూడా ఆమె చెప్పారు. ఇక తమన్ గురించి మన అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది. తన చిన్నవయసులో తండ్రి కన్నుమూయడంతో అప్పటి నుండే కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చాడు.