ప్రముఖ మలయాళ నటుడు, పలు టీవీ షోష్ ద్వారా పాపులరైన కొల్లం సుధి మరణించారు. తన వయసు 39 సంవత్సరాలు కాగా.. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున మరో ముగ్గురితో కలిసి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కేరళలోని త్రిసూర్‌లో ఈ ప్రమాదం సంభవించగా.. అదే కారులో ఉన్న మిగిలిన కళాకారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఉల్లాస్ అరూర్, బిను ఆదిమాలి, మహేష్‌తో పాటు కొల్లం సుధి ప్రయాణిస్తున్న కారును ఉదయం 4.30 గంటలకు ట్రక్కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగ్గ.. వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో సుధి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కొల్లం సుధి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. కాగా.. వివిధ టీవీ ప్రోగ్రామ్స్‌తో ప్రసిద్ధి చెందిన కొల్లం.. రెండు సినిమాల్లో కూడా నటించాడు. అయితే, సుధి అకాల మరణ వార్తతో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా.. పలువురు స్టార్స్ ఆయనకు సంతాపం తెలియజేశారు. ఇదే క్రమంలో నటుడు కళాభవన్ షాజోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొల్లం ఫొటో షేర్ చేస్తూ..
ప్రియమైన స్నేహితుడికి నివాళులు అర్పించారు. సుధి (Actor) నటించిన సినిమాల విషయానికొస్తే.. 2015లో అజ్మల్ దర్శకత్వంలో ‘కాంతరి’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అతను ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కాగా.. ‘కట్టప్పనయిలే రిత్విక్ రోషన్’, ‘కుట్టనాదన్ మార్పప్ప’ సహా పలు మలయాళ చిత్రాల్లో కనిపించాడు. అనేక స్టేజ్ షోస్‌లో తన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. ఏదైమైనా ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ కమ్ ఎంటర్‌టైనర్‌ను హఠాత్తుగా కోల్పోవడం.. చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది.