అస్మిత (Ashmita) అందరికీ తెలుసు కదా. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె తర్వాత ‘కలెక్టర్ గారి భార్య’ ‘మురారి’ (Murari) ‘అప్పుడప్పుడు’ ‘మధుమాసం’ ‘అతిథి’ (Athidhi) వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే వర్షం సినిమాలో కూడా నటించింది అని చాలా మందికి తెలీదు. అయితే ఆ సినిమాలో తన పాత్ర గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పి ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. అస్మిత మాట్లాడుతూ… “నన్ను ‘వర్షం’ (Varsham) సినిమాలో చూశాను అని చాలామంది అంటున్నారు.
ఆ చిన్న క్యారెక్టర్ ఎందుకు చేశారు అని కూడా అడుగుతున్నారు. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఈరోజు నేను మీకు చెబుతాను. నేను ఆ సినిమాలో పని మనిషి తరహా పాత్ర చేశాను. సునీల్ (Sunil) గారి పెట్రోల్ బంక్ వద్ద చీపురుతో తుడుస్తూ స్వీపర్ లా కనిపిస్తాను. వాస్తవానికి కేవలం ఆ పాత్ర కోసం అని నేను చేయలేదు. మొదట ఆ సినిమాలో నాకు విలన్ గా చేసిన ‘గోపీచంద్ భార్య పాత్ర’ అని చెప్పారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది.
నేను గోపీచంద్ (Gopichand) భార్యగా చేస్తున్నప్పుడు ఆయన నన్ను టార్చర్ పెట్టి.. నా చెయ్యి విరగ్గొట్టి.. విడాకుల పేపర్లపై సంతకాలు చేయించి బయటకు గెంటేస్తారు. అటు తర్వాత త్రిషని ఆయన కిడ్నాప్ చేసినప్పుడు.. ప్రభాస్ (Prabhas) అండ్ ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే.. నేను వెళ్లి వాళ్ళకి అసలు విషయం చెబుతాను. ఆ తర్వాత వాళ్ళు గోపీచంద్ ఇంటికి వెళ్లి.. త్రిషని (Trisha) తీసుకొస్తారు. ఇది నా రోల్.
కానీ తర్వాత మేకర్స్ మనసు మార్చుకుని.. గోపీచంద్ గారికి భార్య పాత్ర లేకుండా తీసేద్దాం అని అనుకున్నారట. ఆ విషయం చెప్పినప్పుడు.. నన్ను స్వీపర్ గా మాత్రం చూపించడం ఎందుకు.. నేను సీరియల్స్ లో హీరోయిన్ గా చేస్తున్నాను. దయచేసి అది కూడా తీసేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు నాకు తీసేస్తాము అని ప్రామిస్ అయితే చేయలేదు. బ్యాక్ గ్రౌండ్లో అలా కనిపించాను అంతే” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.