బాలీవుడ్ నటి రిమ్ సేన్ ను ఓ వ్యక్తి మోసం చేసి రూ.4.14 కోట్లు కొట్టేశాడు. గోర్గాన్ కి చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్ ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది రిమీ తెలిపింది. అంధేరిలోని జిమ్‌లో అతడిని కలిసినట్లు.. ఆ తరువాత స్నేహితులమయ్యామని చెప్పింది. మంచి రాబడులు వస్తాయని చెప్పి..
ఓ కొత్త వెంచర్ లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేసినట్లు రిమీ సేన్ వెల్లడించింది. అతడు చెప్పినట్లుగానే చేశానని.. కానీ తరువాత జతిన్ వ్యాస్ అసలు కొత్త కంపెనీను ప్రారంభించలేదని తెలిసి మోసపోయినట్లు గ్రహించానని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్ పై ఐపీసీ సెక్షన్ 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.
రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన ‘ధూమ్’ సినిమాలో నటించింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అందరివాడు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ‘గరం మసాలా’, ‘ఫిర్ హేరా ఫేరీ’, ‘క్యూన్ కి’, ‘గోల్‌మాల్’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్. హిందీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కూడా కనిపించింది.