మెగా కాంపౌండ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మన శంకర వరప్రసాద్’ సినిమా పేరే వినిపిస్తోంది. సంక్రాంతి రేసులో చిరంజీవి ఉన్నారన్న మాటే ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. అయితే ఈ హడావిడిలో అసలు మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మరో భారీ ప్రాజెక్ట్ వెనకబడిపోయిందనే చర్చ మొదలైంది. అదే ‘విశ్వంభర’. రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయింది.
వాస్తవానికి ఈ సంక్రాంతికే ఈ విజువల్ వండర్ థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనులు అనుకున్న టైమ్ కు పూర్తి కాకపోవడంతో రేసు నుంచి తప్పుకుంది. గతంలో విజువల్స్ పరంగా కొన్ని సినిమాలకు వచ్చిన నెగటివ్ ట్రోల్స్ దృష్టిలో పెట్టుకుని, అవుట్ పుట్ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే నిదానమే ప్రధానం అనుకుంటూ రిలీజ్ ను వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు.
అయితే సమస్య వాయిదా పడటం కాదు, సినిమా మీద బజ్ లేకపోవడం. ప్రస్తుతం అందరూ అనిల్ రావిపూడి సినిమా మీదే ఫోకస్ పెట్టారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మీద కనీస చర్చ కూడా జరగడం లేదు. గతంలో వదిలిన గ్లింప్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇటు సామాన్య ప్రేక్షకులు, అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను కాస్త లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి ఇందులో మేటర్ తక్కువేమీ కాదు. దశాబ్దాల తర్వాత త్రిష తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. కీరవాణి సంగీతం, మీనాక్షి చౌదరి, ఆషిక లాంటి అందగత్తెలు ఉన్నారు. చిరు పాత క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రేంజ్ లో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అయినా సరే ప్రమోషన్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో సౌండ్ చేయలేదు.
బహుశా సంక్రాంతి సినిమా రిలీజ్ అయ్యేదాకా దీని గురించి మాట్లాడకూడదని స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు కావచ్చు. ఈ గ్యాప్ లో ఒక పవర్ ఫుల్ టీజర్ ను కట్ చేసి, ఒక్క దెబ్బతో హైప్ పెంచాలని చూస్తున్నారట. చిరంజీవి మాత్రం ఈ కథ మీద, డైరెక్టర్ విజన్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా, ఒక్కసారి ప్రమోషన్స్ స్టార్ట్ అయితే విశ్వంభర విశ్వరూపం చూపిస్తుందని టాక్.
