దక్షిణాది సినిమాలతో గత తరం ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హాస్య నటి బిందు ఘోష్. వయసు సంబంధిత అనారోగ్యంతో ఆమె (76) ఇటీవల కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా బాధపడుతున్న చెన్నైలోని విరుగంబాక్కంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ పరిశ్రమలో సీనియర్ నటులు ఆమె కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆ రోజుల్లో చాలామంది అగ్ర నటులతో ఆమె కలసి పని చేశారు. బిందు ఘోష్ Star (Bindhu Ghosh) అసలు పేరు విమల.
తమిళంలో 1960లో వచ్చిన ‘కళత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో ఆమె బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ సినిమాలో బాల నటుడు కమల్ హాసన్‌తో (Kamal Haasan) కలసి ఓ గ్రూపు డ్యాన్సర్‌గా పని చేశారు. అప్పటి నుండి తంగప్పన్ మాస్టర్ పని చేసిన అన్ని సినిమాల్లోనూ బింధు ఘోష్ గ్రూపు డ్యాన్సర్‌గా కనిపించారు. ఈ క్రమంలో తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో హాస్య నటిగా అలరించారు.
అంతేకాదు ఆమె స్టేజీ ఆర్టిస్టు కూడా. ఇక తెలుగు సినిమాల వరకు చూస్తే ‘దొంగ కాపురం’ (1987), ‘పెళ్ళిచేసి చూడు’ (1988), ‘కృష్ణగారి అబ్బాయి’ (1989), ‘ప్రాణానికి ప్రాణం’ (1990), ‘చిత్రం భళారే విచిత్రం’ (1992) తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఇక గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిందు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ఆమె చికిత్సకు సహాయం చేశారు. గతంలో బొద్దుగా ఉన్న బిందు ఘోష్ అనారోగ్యంతో బక్కచిక్కిపోయారు. 118 కిలోలు ఉన్న ఆమె (Bindhu Ghosh) అనారోగ్యం కారణంగా చివరి రోజుల్లో 38 కిలోలకు తగ్గిపోయారు. ఆహారం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డారని సమాచారం.