కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు ఈ మధ్యనే కాలం చేశారు. ఆయన మరణం టాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేసింది. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలాగే కొన్ని క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. అయితే ఆయన సినిమాల్లో నటించిన ఎంతో మంది స్టార్లుగా ఎదిగారు, కంప్లీట్ యాక్టర్స్ అనిపించుకుని ఇప్పటికీ బిజీగా రాణిస్తున్నారు. విశ్వనాధ్ గారి సినిమాల వల్ల జాతీయ పురస్కారాలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. నిన్న విశ్వనాథ్ గారి జయంతి కావడంతో, ఆయన్ని స్మరించుకుంటూ ‘కళాతపస్వికి కళాంజలి’ అనే పేరుతో హైదరాబాద్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు టాలీవుడ్ పెద్దలు. ఈ వేడుకకు విశ్వనాథ్ గారితో పనిచేసిన సినీ ప్రముఖులు అలాగే ఆయన స్ఫూర్తితో నటులుగా, నటీమణులుగా మారిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ లిస్ట్ లో సహజనటి జయసుధ కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ … “ఎంతోమంది హీరోయిన్స్ విశ్వనాథ్ గారితో మంచి మంచి సినిమాలు చేశారు.
కానీ జయసుధ ఎందుకు చేయలేదు అని చాలా మందికి అనిపించొచ్చు. విశ్వనాథ్ గారు తీసిన ‘కాలాంతకులు’ .. ‘అల్లుడు పట్టిన భరతం’ వంటి కమర్షియల్ సినిమాలు నేను చేశాను. నిజానికి ‘సాగర సంగమం’ సినిమాలో హీరోయిన్ గా నేనే చేయాలి.నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కమల్ హాసన్ గారు బిజీగా ఉండటం వలన ఆ సినిమా ఆలస్యమైంది. ఆయన ఖాళీ అయినప్పుడు నేను ఎన్టీఆర్ గారి సినిమాతో బిజీగా ఉన్నాను.
డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ‘సాగర సంగమం’ కోసం తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్ గారు అలిగారు. ఆయన అలక చాలా ఏళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఆ కారణంతో ఆయన నాతో సినిమాలు తీయలేదు. నిజం చెప్పాలంటే ‘సాగరసంగమం’లో ఆ పాత్రకి జయప్రదనే కరెక్ట్ అని నాకు అనిపించింది.చాలా కాలానికి విశ్వనాథ్ గారు యాక్టర్ అయిన తరువాత, నాకు ఒక కథ చెప్పి తనతో యాక్ట్ చేయమని అడిగారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు” అంటూ జయసుధ చెప్పుకొచ్చారు.