సినిమాల్లో ఊహాకందనీ విచిత్రాలు జరినట్లే నిజజీవితంలో అంతకుమించి ట్విస్టులు వుంటాయి. ఇలా కూడా జరుగుతుందా అనిపించేలా దేవుడు ఇచ్చే షాక్ లకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సినిమాల్లో మనకు వినోదం పంచే నటీనటులకే ఆ షాక్ లు తగిలితే. ఇలాంటి కోవలోకే వస్తారు అలనాటి నటి కేఆర్ విజయ. దక్షిణాదిలోని అందరూ అగ్రనటుల సరసన నటించిన ఆమెకు అమ్మవారి వేషాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా చిత్రాలలో కేఆర్ విజయను చూసిన ప్రేక్షకులు నిజంగానే అమ్మవారు వచ్చిందా అనుకునేవారు.
థియేటర్లలో అమ్మవారి రూపంలో కేఆర్ విజయ కనిపించగానే హారతలు పట్టిన సందర్భాలు కోకొల్లలు. కేరళకు చెందిన కేఆర్ విజయ.. 11 ఏళ్ల చిరుప్రాయంలోనే నాటక రంగంలోకి ప్రవేశించి అనతి కాలంలోనే హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కర్పగం అనే తమిళ సినిమాతో కథనాయికగా ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ పాండవీయంలో రుక్మీణి క్యారెక్టర్ చేసి తెలుగువారిని పలకరించారు. అప్పటి నుంచి దశాబ్ధాల పాటు స్టార్ హీరోయిన్‌గా దక్షిణాదిని ఏలారు కేఆర్ విజయ.
ఇంతటి స్టార్ డమ్, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు అంతస్తులు నాణేనికి ఒకవైపు మాత్రమే. కేఆర్ విజయ చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించారు. అంతేకాదు.. ఆమె జీవితంలో ఒక విషాద ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే వుంటుందట. చిన్నతనంలో ఓ రోజున కేఆర్ విజయ చెల్లెలికి అనారోగ్యంగా వుంది. ఆ సమయంలో ఆమె అమ్మకు కూడా ఒంట్లో బాగోలేదు. చెల్లికి మందు తీసుకొద్దామని చెప్పి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని డాక్టర్ దగ్గరకు పరుగు పరుగున వెళ్లి ఒంట్లో బాలేదు మందు ఇవ్వమని చెప్పారు విజయ.
అయితే ఎవరికి, ఏంటీ అనే విషయం కనుక్కోకుండా అశ్రద్ధ వహించిన డాక్టర్.. ఆ చిన్నారి చెప్పింది వాళ్లమ్మ గారికి అనుకుని నేనొచ్చి చూస్తాలే అని చెప్పింది. ఆ వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లిన విజయ.. చెల్లెలిని ఒళ్లో కూర్చొబెట్టుకున్నారు. అప్పటికే ఆ పాప కళ్లు మూసుకుని వుంది, నిద్రపోతుందని భావించిన కేఆర్ విజయ పాలు పడదామని బుడ్డి తీసి పట్టడానికి ప్రయత్నించారు. కానీ చిన్నారిలో ఏ కదలికా లేదు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన పెద్దవాళ్లు..
పాప నోట్లో నుంచి పాలు కారిపోవడం, ఒంట్లో ఏ కదలికా లేకపోవడంతో గొల్లుమన్నారు. ఆ కాసేపటికి కానీ తన చెల్లి చనిపోయిన విషయం కేఆర్ విజయకు అర్ధం కాలేదు. ఈ ఘటన జరిగిన రోజున తన చెల్లెలు ఏ చొక్కా అయితే వేసుకుందో దా చాలాకాలం భద్రంగా దాచుకున్నారు విజయ. ఆ రోజున సమయానికి డాక్టర్ వచ్చి చికిత్స చేసి వుంటే తన చెల్లెలు ప్రాణాలతోనే వుండేదని పలుమార్లు చెప్పుకొచ్చారు కేఆర్ విజయ.