ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య భాస్కరన్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది. రెండొందలకు పైగా సినిమాల్లో నటించింది ఐశ్వర్య. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో హాయిగా జీవిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఐశ్వర్య 1989లో వచ్చిన ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ పరిచయమైంది. మోహన్‌లాల్ నటించిన ‘బటర్‌ఫ్లైస్’, ‘నరసింహమ్’, ‘ప్రజా’ వంటి హిట్ సినిమాల్లో ఐశ్వర్య హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది.
అలానే పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పింది. తనకు సరైన పని లేదని.. డబ్బు కూడా లేదని.. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నానని చెప్పుకొచ్చింది. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పని చేయడానికైనా ఆలోచించనని చెప్పింది. ఎవరైనా ఉద్యోగం ఇస్తానంటే.. తప్పకుండా చేస్తానని..
అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తానని చెప్పింది. తను నటిగా కెరీర్ మొదలుపెట్టిన మూడేళ్లపాటు కెరీర్ బాగానే సాగిందని.. ఇంతలోనే పెళ్లి కావడంతో ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది. హీరోయిన్ గా అందరికీ సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదని.. ప్రస్తుతం తను ఇండిపెండెంట్ గా ఉన్నానని.. యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నానని తెలిపింది. కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు తనకొక మెగా సీరియల్ ఆఫర్ కావాలని చెప్పుకొచ్చింది.