సీనియర్ నటి సుధా చంద్రన్ (Sudha Chandran) ‘మయూరి’ అనే సినిమాతో అలాగే పలు సీరియల్స్ తో పాపులర్ అయ్యారు. ఈమె జీవితంలో చాలా విషాదం నిండి ఉంది. చిన్న వయసులోనే కాలు పోగొట్టుకుని ఎంతో మనో వేదనకు గురయ్యారట సుధా చంద్రన్. ఇటీవల ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు ఆమె. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “తమిళనాడులో ఉన్న వాయలూర్ మురుగన్ దేవాలయానికి వెళ్లొస్తున్న టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది.
అందులో భాగంగా నా కాలు పోయింది. డాక్టర్ చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. నేను నడవడం కష్టం అని తేల్చేశారు. ఆ టైంలో నేను ఇంకా మైనర్నే. ‘మొగ్గలోనే నా జీవితం రాలిపోయింది’ అని నేను ఆ టైంలో బాగా కృంగిపోయాను. అయితే అప్పుడు మా నాన్నగారు నాకు బాగా సపోర్ట్ చేశారు. చివరి వరకు నేను నీకు అండగా నిలబడతాను అని నాలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. నా విజయాన్ని ఆయన చూశారు” అంటూ చెప్పుకొచ్చారు సుధా చంద్రన్.
చిన్న వయసులోనే కాలు కోల్పోవడం అనే ఎమోషనల్ పాయింట్ ఉండటం వల్ల ఈమె జీవితాన్ని ‘మయూరి’ అనే సినిమాగా తీశారు. అందులో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. అయితే ‘అది నీ కథ అవ్వడం వల్ల నువ్వు బాగా నటించగలిగావు. వేరే సినిమాల్లో అయితే చేయలేవు’ అంటూ కొంతమంది ఆమెను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారట. అటు తర్వాత ఓ హిందీ డైరెక్టర్ ‘నువ్వు నటిగా పనికిరావు. అనర్హురాలివి’ అంటూ నెగిటివ్ గా స్పందించాడట.
ఈ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుని సినిమాల్లో ఎదగడానికి సుధా చంద్రన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది. అయితే ఏ హిందీ డైరెక్టర్ అయితే సుధా చంద్రన్ ని విమర్శించాడో.. ఆ దర్శకుడి చేతుల మీదుగా ఓ సీరియల్ కి సంబంధించి ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నారట సుధా చంద్రన్.