టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు మొదటి సినిమాతోనే తన మార్క్ కామెడీతో మెప్పించాడు. ‘మల్లేశం’ సినిమాతో హీరోగా కూడా మారాడు. అలా అని హీరోగానే సినిమాలు చేయకుండా.. కామెడీనే నమ్ముకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమాలో ప్రియదర్శి కామెడీ మాములుగా ఉండదు. కమెడియన్ గా తన కెరీర్ ఇంకొన్నేళ్లు సాఫీగా సాగిపోవడానికి ఈ సినిమా సహాయపడుతుంది.
ఇలా ఆర్టిస్ట్ గా బిజీ అవుతోన్న ఈ నటుడికి డైరెక్టర్ గా సినిమా చేయడం డ్రీమ్ అట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని అంటున్నాడు ప్రియదర్శి. దీనికోసం కథ సిద్ధం చేస్తున్నానని చెప్పాడు. అయితే దర్శకత్వం అనేది ఫుల్ టైమ్ జాబ్ కాదట. తన పూర్తి స్థాయి దృష్టి నటనపైనే ఉందని.. కానీ డైరెక్టర్ గా సినిమా మాత్రం చేస్తానని చెబుతున్నాడు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని..
అప్పుడప్పుడు సీరియస్, ఎమోషనల్, సెంటిమెంటల్ పాత్రలు కూడా చేస్తేనే నటుడిగా గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘జాతిరత్నాలు’ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా టెన్షన్ పడ్డామని.. కామెడీ తప్ప లాజిక్కులు లేవని భయపడ్డామని.. కానీ ఓ షెడ్యూల్ పూర్తవ్వగానే నమ్మకం కలిగిందని.. థియేటర్లో ప్రేక్షకుల నవ్వులు చూసాక.. చాలా సంతోషంగా అనిపించిందని చెప్పాడు. తన కెరీర్ లో ఇదొక మరపురాని సినిమాగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు.