కొద్దిరోజులుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. శరత్ బాబు మరణవార్తతో మొదలైన ఈ విషాదాల సంఖ్య పెడుతూనే ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల చూసుకుంటే కోలీవుడ్ యాక్టర్ బోస్ వెంకట్ సోదరి, ఆ తర్వాత ఆమె సోదరుడు కన్నుమూశారు. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు, టాలీవుడ్ యువ దర్శకుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల తండ్రి మరణ వార్త వెలుగులోకి వచ్చింది. అలాగే పాపులర్ యాక్టర్ కమ్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు.
ఆయన కాలికి బలమైన గాయమవడంతో వైద్యులు సర్జరీ చేశారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ బంధువు యువ కన్నడ నటుడు సూరజ్ కుమార్ కూడా రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుడి కాలు తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో అతని కాలుని మోకాలి వరకు తొలగించారనే భయంకరమైన వార్త కూడా వినాల్సి వచ్చింది. నిన్నటికి నిన్న యూట్యూబర్ దేవరాజ్ పాటిల్ కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు మరో విషాదం కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత (Director) బైజు పరవూర్ కేరళలోని కొచ్చిలో కన్నుమూసినట్టు సమాచారం. అనుమానాస్పద రీతిలో ఈయన చచ్చిపడున్నట్టు సమాచారం. అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించినట్లు తెలియజేసారు. జూన్ 24న బైజు పరవూర్ ఓ హోటల్‌లో భోజనం చేశారు. ఇంటికి వచ్చాక కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యారట. అంతే తర్వాత ఇలా జరిగింది.
బైజు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. 45 సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసారని సమాచారం. ‘సీక్రెట్’ అనే సినిమాకి కథ, మాటలు రాయడంతో పాటు స్క్రీన్‌ప్లే , డైరెక్షన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఇంతలోనే బైజు కన్నుమూయడం అనేది విచారకరమైన వార్తగా చెప్పుకోవాలి. ఆయన వయసు కూడా 42 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం.