2014, 15, 16 లలో రిలీజ్ అయిన చిత్రాలలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటీనటులు, టెక్నీషియన్లకు నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేగింది. వీటిని కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. బన్నీ వాసు ఈరోజు ఉదయం వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ” ఏం .. మెగా హీరోలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి కొత్తగా నటన నేర్చుకోవాలా? చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ తీసుకోవాలా?” అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో మెగా హీరోలకు ఒక అవార్డు కూడా రాలేదనే ఆగ్రహం స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఈ పోస్ట్ ని వెంటనే తీసివేశారు. తాజాగా డైరక్టర్ మారుతీ ట్విట్టర్ లో సొంతవారికి అవార్డులు ఇస్తున్న ఒక టీవీ కామెడీ వీడియోని పెట్టి తన వ్యతిరేకతను ప్రకటించారు. మరో డైరక్టర్ గుణశేఖర్ మాత్రం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. తన సినిమా రుద్రమదేవి ఎందుకు ఉత్తమ చిత్రం కాదో చెప్పమని లేఖ ద్వారా అడిగారు. తెలుగు జాతిని గుర్తు చేసేటువంటి చిత్రాన్ని తీసినందుకు క్షమించమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ఈ విషయం పై నోరు విప్పుతారో.. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.