అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈరోజు ‘జెర్సీ’ సినిమా విడుదల కావాల్సింది కానీ విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు ఈ సినిమాకి బ్రేక్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీ, ముంబై లాంటి రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తుండడంతో ఈ సినిమాను సడెన్ గా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. రోజురోజుకి కరోనా తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గేలా లేదు.
ఈ క్రమంలో ‘జెర్సీ’ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే సినిమా వాయిదాల మీద వాయిదా పడి చాలా ఆలస్యమైంది. దీంతో ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే హీరో షాహిద్ కపూర్ మాత్రం ‘జెర్సీ’ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదట. ‘జెర్సీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నాడు షాహిద్ కపూర్. అతడు నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అతడి రేంజ్ ను అమాంతం పెంచేసింది. ‘జెర్సీ’ సినిమా మరో మెట్టు ఎక్కిస్తుందని.. తనను ఇంకా పెద్ద స్టార్ ని చేస్తుందని భావిస్తున్నాడు షాహిద్ కపూర్. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని అంటున్నాడు షాహిద్. అందుకే తన రెమ్యునరేషన్ గా తీసుకున్న రూ.31 కోట్ల నుంచి ఐదు లేదా పది కోట్లు.. ఎంత కావాలంటే అంత కోత వేసుకోవడానికి రెడీగా ఉన్నానని.. కానీ ఈ సినిమాను ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరుతున్నాడట.
కొన్నాళ్లు సినిమాను హోల్డ్ చేసి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడట. మరి దీనికి నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ ఒప్పుకుంటారో లేదో చూడాలి!