సినీ పరిశ్రమని విషాదాలు భయపెడుతూనే ఉన్నాయి.ఈ ఏడాది ఇప్పటికే ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి మరణించడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు ఇంకో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది.
వివరాల్లోకి వెళితే… పలు సినిమాలు, సీరియళ్లు నిర్మించిన ప్రముఖ రచయిత వి. మహేశ్ శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో మరణించారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మహేశ్… ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడు. ఎన్టీఆర్ కథానాయకుడిగా 1976 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మనుష్యులంతా ఒక్కటే’ చిత్రానికి కూడా ఈయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సినిమాకి మూలకథను అందించింది కూడా వి. మహేశ్ కావడం విశేషం.
ఆ చిత్రానికి గాను ఆయనకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును కూడా లభించింది. ఆ తర్వాత లక్ష్మీదీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహం’ (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) వంటి చిత్రాలను కూడా ఈయన నిర్మించడం జరిగింది. తర్వాత కిరణ్ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి భూమయ్యతో ‘భగత్’ చిత్రాన్ని కూడా నిర్మించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన ‘హరి భక్త కథలు’ ధారావాహికకు కూడా ఈయనే నిర్మాత. ఇక మహేశ్ వయస్సు 85 ఏళ్లు అని తెలుస్తుంది. ఆయన మృతికి చింతిస్తూ తెలుగు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వి. మహేశ్ (V Mahesh) అంత్యక్రియలు చెన్నయ్ లో సోమవారం నాడు నిర్వహించబోతున్నారు.