వయసు మీద పడుతున్నా, గొంతు సహకరించకున్నా స్వరార్చన చేస్తూ ఏళ్ల తరబడి గాయకులకుగా ఉన్న సినిమా పరిశ్రమ మనది. ఇలాంటి సినిమా పరిశ్రమలో ఇంకా 40 ఏళ్లు కూడా రాని ఓ గాయకుడు ఇక పాటలు పాడను, రిటైర్ అవుతాను అని అన్నారు అంటే.. కచ్చితంగా షాకింగ్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అర్జీత్ సింగ్ అభిమానులు, సంగీతం అభిమానులకు. ఎందుకంటే ఆయన సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. తాజాగా దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు.
ఇకపై కొత్త ప్రాజెక్టులు ఏవీ అంగీకరించనని రిటైర్మెంట్ ప్రకటించడంతో అర్జీత్ సింగ్ ఫ్యాన్స్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ పోస్ట్‌లు పెట్టారు. దానికి ఆయన రియాక్ట్ అవుతూ రిటైర్మెంట్‌కు ఒక కారణమని చెప్పలేను. చాలా అంశాలున్నాయి. నేను ఎన్నో రోజుల నుండి ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రకటించాను అని అర్జీత్ సింగ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అయితే ఒక విషయం చెప్పగలను.. నాకు కొత్తదనం అంటే ఇష్టం. అందుకే నా పాటలను ఎప్పుడూ ఒకేలా పాడను. వేదికలపై వాటి ట్యూన్‌ని కాస్త మార్చి కొత్తగా పాడే ప్రయత్నం చేస్తుంటాను. సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే కొత్త గాయకుల పాటలు కూడా వినాలని అనుకుంటున్నాను. వాళ్లు కూడా నాకు స్ఫూర్తినిస్తున్నారు. అందుకే కొత్త గాయకుల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను అని అర్జీత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు
అర్జీత్ సింగ్ సినిమా, సంగీతానికి చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు రెండు జాతీయ అవార్డులు ఇచ్చింది. హిందీలోనే కాదు టాలీవుడ్‌లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ‘కనులను తాకే ఓ కల..’ (మనం), ‘అదేంటి ఒక్కసారి..’ (స్వామి రారా), ‘మాయా..’ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) పాటలు ఆయన పాడినవే. ఇక బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీలోనూ ఆయన పాటలు పాడారు. అయితే, సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జీత్ ఇండిపెండెంట్ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం.