బాలీవుడ్‌లో హిట్లు సరిగ్గా లేవు కాబట్టి సరిపోయింది కానీ.. ఒకవేళ ఉండి ఉంటే ‘వెల్‌కమ్’ సినిమాల ఫ్రాంచైజీ ఈపాటికి ఐదారు నెంబర్లు దాటిపోయుండేది. ఆ విషయం పక్కనపెడితే… ఇప్పుడు ‘వెల్‌కమ్’లో మూడో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం వచ్చినా.. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాతో ఇద్దరు ప్రముఖ సింగర్స్ నటులుగా మారబోతున్నారట. ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ‘వెల్‌కమ్’, ‘వెల్‌కమ్ బ్యాక్’ సినిమాలు వచ్చాయి.
రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించాయి. ఇప్పుడు వీటికి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ 3’ సిద్ధమవ్వనుంది. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. వారితోపాటు పాటలతో ఉర్రూతలూగించే దలేర్ మెహందీ, మికా సింగ్ కూడా నటిస్తారు అని సమాచారం. ఇన్నాళ్లూ పాటలు, సింగిల్స్‌తో ఆకట్టుకున్న దలేర్ మెహందీ, మికా సింగ్ ఇప్పుడు తెరపై కనిపించనుండటం ‘వెల్‌కమ్ 3’ సినిమాలో విశేషం అంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి.
సినిమా టీమ్ నుండే ఈ సమాచారం వచ్చింది అని కూడా అంటున్నారు. ఈ సినిమాలో ఈ ఇద్దరు గాయకులు కమెడియన్లుగా కనిపిస్తారని భోగట్టా. ఈ మేరకు ఇప్పటికే వీరితో టీమ్ చర్చలు జరిపిందట. అంతేకాదు ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభిస్తారట. ఈ సినిమాలో ఐదుగురు హీరోలు ఉండటంతో.. ఐదుగురు హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నారట.
ఇందులో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసేశారు అని అంటున్నారు. వారి వివరాలు త్వరలోనే వస్తాయి అని చెబుతున్నారు. ఇక గతంలో లాగే ఈ సినిమాలోనూ పెళ్లి నేపథ్యంలోనే సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి అంటున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. అనీశ్ బజ్మీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని భోగట్టా.