ఈ ఏడాది మనం మిస్‌ అయిన స్టార్‌ హీరోలు వీరే

అప్పటి హీరోలలాగా సంవత్సరానికి పదేసి, పదిహేనేసి సినిమాలు చేయాలని ఇప్పుటి హీరోల అభిమానులు అనుకోవడం లేదు. అయితే కనీసం ఏడాదికి ఒక సినిమా వచ్చినా… చూసి తరిస్తాం అనుకుంటున్నారు. అంతకుమించి సినిమాలు వస్తే అదో అద్భుతం అనుకునే పరిస్థితులు. అయితే రెండేళ్ల క్రితం వరకు మన హీరోలు ప్రేక్షకులు, అభిమానుల కోరికను తీరుస్తున్నట్లు కనిపించారు. అయితే మాయదారి కరోనా కారణంగా సినిమాలు విడుదల తేదీలు మారిపోయాయి. అన్నీ సిద్ధంగా ఉన్నా సినిమా రిలీజ్‌ చేయలేని పరిస్థితి. అలా 2021లో కొంతమంది హీరోలు వెండితెరపై మెరవలేకపోయారు. వాళ్లెవరు, 2022లో వారి నుండి ఏ సినిమాలొస్తున్నాయో చూద్దామా?

* టాలీవుడ్‌ చాలా రోజుల నుండి సినిమా విడుదల కాని హీరో అంటే ఎన్టీఆర్‌ పేరే చెప్పాలి. 2018లో ‘అరవింద సమేత’ తర్వాత తారక్‌ నుండి మరో సినిమా రాలేదు. ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వస్తుంది అనుకున్నా వీలవలేదు. వచ్చే ఏడాది తొలి వారంలోనే ఈ సినిమా వచ్చేస్తోంది. ఆ తర్వాత కొరటాల సినిమా స్టార్ట్‌ చేసి ఏడాది ఆఖరిలో తెచ్చేద్దాం అని చూస్తున్నారు.

* చేతిలో పూర్తిస్థాయి సినిమా ఉన్న విడుదల చేయని, చేయలేకపోయిన హీరో ప్రభాస్‌. ‘రాధేశ్యామ్‌’ సినిమా ఎప్పుడో సిద్ధమైపోయినా వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. రెండేళ్లుగా డార్లింగ్‌ నుండి సినిమాలు లేవు. ‘రాధే శ్యామ్‌’ సంక్రాంతికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వరుసగా ‘సలార్’, ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ కూడా లైన్‌లో ఉన్నాయి. డార్లింగ్‌ నుండి వచ్చిన ఆఖరి సినిమా 2019లో వచ్చిన ‘సాహో’.

* ఇలాంటి పరిస్థితినే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎదుర్కొంటున్నారు ‘ఆచార్య’తో. ఈ సినిమా ఎప్పుడో సిద్ధమైపోయింది. కానీ 2021లో రాలేదు. ఆఖరిగా చిరంజీవి సినిమా ‘సైరా’ 2019లో వచ్చింది. ఆ తర్వాత చిరు వరుస సినిమాలు అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు సెట్స్‌ మీద ‘గాడ్‌ఫాదర్‌’, ‘భోళాశంకర్‌’, బాబీ సినిమా ఉన్నాయి. ఇది కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశారు. వీటిలో రెండు సినిమాలు వచ్చే ఏడాది పక్కా.

* ఇక రామ్‌చరణ్‌ సంగతి చూస్తే… ఆయన సినిమా వచ్చి కూడా రెండేళ్లు అవుతోంది. 2019లో వచ్చిన ‘వినయ విధేయ రామా’నే ఆఖరి సినిమా. అప్పటి నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లోనే ఉన్నారు. మధ్యలో ‘ఆచార్య’లో కూడా నటించారు. దీంతో 2021లో ఏ సినిమా కూడా రాలేదు. వచ్చే ఏడాది చరణ్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా. జనవరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’ వస్తాయి కాబట్టి. ఇది కాకుండా శంకర్ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

* మహేష్‌బాబు అయితే ఆఖరిగా వెండితెరపైకి వచ్చింది అయితే 2020లో. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో వచ్చారు. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’ తీసుకొద్దామనుకున్నా కుదర్లేదు. 2022 సంక్రాంతికి వచ్చేలా కనిపించినా… కుదర్లేదు. ఇప్పుడు సమ్మర్‌ వరకు ఆగాల్సిందే. ఈ సినిమా తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా మొదలవ్వాలి.

* 2020లో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాతో ఆఖరిగా వెండితెరపై మెరిసిన విజయ్‌ దేవరకొండ 2021లో ఏ సినిమాలోనూ హీరోగా చేయలేదు. చిన్న కేమయో అయితే ‘జాతి రత్నాలు’లో చేశారు. 2022లో ‘లైగర్‌’ను తీసుకొస్తున్నారు. ఆ తర్వాతి సినిమా ఏంటి అనే విషయంలో స్ఫష్టత లేదు.

* మెగా ఫ్యామిలీలో 2021లో సినిమా చేయని మరో హీరో వరుణ్‌తేజ్‌. 2019లో ‘గద్దలకొండ గణేష్‌’తో ఆఖరిగా వెండితెరపైకి వచ్చిన వరుణ్‌ అప్పటి నుండి ‘గని’ పనుల్లో ఉన్నాడు. అలాగే ‘ఎఫ్‌ 3’ కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాలు తెరపైకి వస్తాయి. ‘గని’ ఈ ఏడాదే రావాల్సి ఉన్నా… వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Share.