‘ఏ మాయ చేసావె’ చిత్రంతో నటుడుగా పరిచయమైన సుధీర్ బాబు తరువాత.. ‘ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శ్రుతి) చిత్రంతో హీరోగా మారాడు. అటు తరువాత ‘ప్రేమకథా చిత్రమ్’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘భలే మంచి రోజు’, ‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇతన్ని ఇండస్ట్రీలో అంతా డెడికేషన్ స్టార్ అని కూడా అంటుంటారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటాడు సుధీర్ బాబు. ఇటీవల వచ్చిన ‘వి’ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ సుధీర్ బాబు పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి! ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు.. తన మామ కృష్ణ అలాగే బావ మహేష్ ల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. అతను మాట్లాడుతూ.. ‘నేను చెయ్యాల్సిన ప్రాజెక్టుల గురించి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తుంటాను.
కానీ నా ఆలోచనలకు తగినట్టే ప్రాజెక్టులు ఫైనలైజ్ చేసుకుంటాను. నాకు నచ్చిన డైరెక్టర్లతోనే వర్క్ చేస్తుంటాను. మామయ్య, మహేష్ ఇచ్చే సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాను. నేను సొంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల రిజల్ట్ తేడా కొట్టొచ్చు. అయినప్పటికీ సొంత తప్పుల వల్లే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడూ నా మామయ్య, మహేష్ ల దగ్గరికి వెళ్లి పెద్ద డైరెక్టర్లకు, నిర్మాతలకు నా పేరు సిఫార్సు చెయ్యండి అని నేను అడగలేదు.కెరీర్ ప్రారంభంలో కూడా నా సినిమాను నిర్మించండి, గైడ్ చేయండి అని కోరలేదు. నేను హీరోని కాకముందు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేసాను.కాబట్టి నాకు సినిమా రంగం పై అవగాహన ఉంది. నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్లే నన్ను ఎంకరేజ్ చేశారు. బావ కదా అని మహేష్ ను అలాగే..పిల్లనిచ్చిన మామయ్య కదా కృష్ణగారిని.. నా సినీ రంగ ప్రవేశం గురించి హెల్ప్ అడగలేదు. అలా వారి బ్యాక్ గ్రౌండ్ వాడుకుంటే.. పెళ్లి చేసుకున్నందుకు కట్నం తీసుకున్నట్లే అవుతుంది. చెప్పాలంటే మా ఫ్యామిలీ బిజినెస్ పురుగుల మందులు తయారు చెయ్యడం. దాని నుండీ బయటకి రావాలనే ఉద్దేశంతోనే నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాను. సొంతంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు.. నా సినీ ఎంట్రీ గురించి మహేష్, కృష్ణ గారిని కలవలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు.