థియేటర్ ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత క్యాసెట్/ సీడీ / డీవీడీ… ఒకప్పుడు తెలుగు సినిమా రిలీజ్ ఇలా ఉండేది. ఆ తర్వాత సాంకేతికతలో మార్పులు వచ్చి ఓటీటీల హవా పెరిగాక థియేటర్ తర్వాత ఓటీటీలు వస్తున్నాయి, ఆ తర్వాత టీవీలు వస్తున్నాయి. కొన్ని ఓటీటీల్లో వచ్చే సినిమాలు దొంగచాటుగా యూట్యూబ్‌లోకి కూడా వస్తున్నాయి. కొన్ని అధికారికంగా వచ్చేస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా ఓటీటీకి కాకుండా థియేటర్ నుండి నేరుగా యూట్యూబ్‌కి వచ్చేయాలని అనుకుంది. కానీ అవ్వలేదు.
సుహాస్ (Suhas) , కార్తీక్ రత్నం (Karthik Rathnam) , రుహానీ శర్మ (Ruhani Sharma) , విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’ (Sriranga Neethulu). ప్రవీణ్‌కుమార్ వీఎస్‌ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మే 30న భవానీహెచ్‌డీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఛానల్ ప్రకటించేసింది. దీంతో ఓటీటీకి కాకుండా నేరుగా యూట్యూబా? అని ప్రశ్న వచ్చింది. కట్ చేస్తే 29న ఉదయం అంటే బుధవారం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వడం మొదలైంది.
దీంతో అసలు ఏం జరిగింది, ముందుగా యూట్యూబ్ ఛానల్‌లోకి వస్తుందని ఎందుకు చెప్పారు, తర్వాత ఓటీటీ అనౌన్స్‌మెంట్ ఎందుకు వచ్చింది అనే చర్చ మొదలైంది. దీనికి ఆన్సర్ దొరకలేదు కానీ.. కొత్త ట్రెండ్‌కి అయితే శ్రీకారం చుట్టినట్లు అయ్యేది. అయినా ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే యూట్యూబ్‌కి రావడం పెద్ద విషయమే. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూడు కథల సమాహారం ఈ సినిమా. టెక్నీషియన్‌గా పనిచేసుకుంటూ బస్తీలో జీవితం కొనసాగిస్తున్న శాంసంగ్ శివ (సుహాస్)కి ఫ్లెక్సీల పిచ్చి.
తన గురించి బస్తీలో మాట్లాడుకోవాలనేది ఆశ. అయితే ఓ ఫ్లెక్సీ విషయంలో ఇబ్బంది వస్తుంది. అదేంటి, తర్వాత ఏమైంది అనేది కథ. కార్తీక్ (కార్తీక్ రత్నం) జీవితంలో అనుకున్నది సాధించలేకపోయానని మద్యానికీ, గంజాయికీ బానిస అవుతాడు. చిన్న కొడుకు అనుకోని విధంగా సమస్యల్లో చిక్కుకుంటాడు. ప్రేమికులైన ఐశ్వర్య (రుహానీ శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్)లది మరో సమస్య. ప్రేమించుకున్న విషయం పెద్దలకి చెప్పే ధైర్యం లేక సతమతమవుతుంటారు. ఇలా నలుగురి విషయంలో వచ్చే మలుపులే సినిమా కథ.