సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో చెప్పలేం. ఊహించలేం. ఒకరు వదులుకున్న అవకాశం, మరొకరికి బంగారు భవిష్యత్తును ఇస్తుంది. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే హీరో సునీల్, నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో జరిగింది. సునీల్ ‘వద్దు’ అని చెప్పిన ఒకే ఒక్క కథ.. నాని కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, అతనికి స్టార్ హోదాను తెచ్చిపెట్టింది.డైరెక్టర్ మారుతి మొదట తన కామెడీ కథతో కమెడియన్ కమ్ హీరో సునీల్‌ని సంప్రదించాడు.
అప్పటికే ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ వంటి హిట్‌లతో సునీల్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మారుతి చెప్పిన ‘భలే భలే మగాడివోయ్’ కథలోని హీరోకి మతిమరుపు అనే పాయింట్ సునీల్‌కు విపరీతంగా నచ్చిందట. సినిమా కచ్చితంగా హిట్టవుతుంది అని నమ్మాడట. అయితే, అప్పటికే హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ఉండటంతో, కథలో కొన్ని యాక్షన్, మాస్ సన్నివేశాలను జోడించాలని మారుతిని కోరాడట సునీల్. కానీ, కథ సహజత్వాన్ని దెబ్బతీయడం ఇష్టంలేని మారుతి అందుకు సున్నితంగా తిరస్కరించాడు.
కథలో ఎలాంటి మార్పులు చేయలేనని చెప్పడంతో, సునీల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.సునీల్ నో చెప్పడంతో, మారుతి అదే కథతో నేచురల్ స్టార్ నానిని కలిశాడు. కథ విన్న వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి మార్పులు కోరకుండా దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మాడు. అలా తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్’ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా నాని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయి, అతనికి స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఒకవేళ సునీల్ కనుక ఎటువంటి కండిషన్ పెట్టకుండా ‘భలే భలే మగాడివోయ్’ చేసుంటే… కచ్చితంగా కథ వేరుండేది.