టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని అద్భుతంగా కొనసాగిస్తున్న నటుడు సునీల్ (Sunil), ఇప్పుడు మరో కొత్త అవతారానికి రెడీ అవుతున్నాడు. కామెడీతో మాత్రమే కాదు, సీరియస్ పాత్రలతోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది 11 సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్, ఈ ఏడాది కూడా ‘రామం రాఘవం’ (Ramam Raghavam), ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) చిత్రాలతో తన మార్క్‌ని చాటాడు. మరోసారి ఓ విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay Thalapathy) హీరోగా తెరకెక్కుతున్న ‘జననాయకన్’ (Jana Nayagan) సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించనున్నాడు. దర్శకుడు వినోద్ (H. Vinoth) రూపొందిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా, విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ఒక సూచనగా తెరకెక్కుతోంది. ఎన్నికల నేపథ్యంలో విజయ్ తీసుకున్న ఈ సినిమా నిర్ణయం, తమిళనాట పెద్ద చర్చను రేపుతోంది. ఈ సినిమాలో విజయ్‌తో పోటీగా ఓ కీలక పాత్రలో సునీల్ నటించనున్నాడని సమాచారం. ముఖ్యంగా సునీల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. వైట్ అండ్ వైట్ గెటప్‌లో, పవర్ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టనున్నాడట.
ఇది పూర్తిగా విజయ్‌కు ప్రత్యర్థిగా ఉండే క్యారెక్టర్ అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో సునీల్‌కు ఇలాంటి పాత్ర చేసే అవకాశం రాలేదు. ఆ రకంగా తమిళ్ సినీ పరిశ్రమలో మరోసారి తన వినూత్న అభినయాన్ని చూపించే ఛాన్స్‌ను సునీల్ అందుకున్నాడు. ఇప్పటికే ‘జైలర్’ (Jailer) చిత్రంతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఇప్పుడు ‘జననాయకన్’ ద్వారా తన సత్తాను మరోసారి రుజువు చేయబోతున్నాడు.
సీరియస్ లుక్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సునీల్ మరోసారి తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం ఖాయమనిపిస్తోంది. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జననాయకన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విజయ్ – సునీల్ మధ్య వచ్చే పొలిటికల్ క్లాష్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మేకర్స్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.