హీరోగా నిలదొక్కుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు సునీల్. అయితే అవేవి అతడికి సరైన ఫలితాన్ని ఇవ్వటం లేదు. సోలో హీరోగా సునీల్ కి చివరి హిట్ సినిమా ‘పూలరంగడు’. తర్వాత వచ్చిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాయి. మొన్నటికిమొన్న వచ్చిన జక్కన్నతో సహా. ఈ పరిస్థులలో సునీల్ కి ఓ సాలిడ్ హిట్ తప్పనిసరి. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాతో ఆ హిట్ వస్తుందన్న ఆశతో ఉన్న సునీల్ అందుకు దసరా పండగనే నమ్ముకున్నాడు.
సంప్రదాయ పరంగా దసరా పండక్కి ఉన్న ప్రాముఖ్యత ఎలా వున్నా సినిమా వ్యాపార పరంగా అదో మంచి సీజన్. వాస్తవంగా అయితే అలాంటి సీజన్ లో సినిమా విడుదలవటం సునీల్ కి ‘గోల్డె’న్ ఛాన్సే. కానీ ఈ పండగ ముహుర్తాన్ని ముందుగానే నిర్ణయించుకుని కాపుగాస్తున్న వారు వేరే ఉన్నారు. రామ్ చరణ్ ‘ధృవ’, కళ్యాణ్ రామ్-పూరిల ‘ఇజం’, రామ్ ‘హైపర్’, నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమాలు దసరాలో ప్రేక్షకులను సరదాల్లో ముంచెత్తనున్నాయి. ఇవికాక తమన్నా-ప్రభుదేవా ‘అభినేత్రి’, నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల చూపూ దసరా పైనే వుంది. పైగా కామెడీ, యాక్షన్ కలగలుపుతో యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన వీరూపోట్ల ఖాతాలోనూ సరైన హిట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి కలయికలో వస్తోన్న ‘గోల్డ్’కి ఏమాత్రం గిరాకీ వుంటుందో మరి..!